వ్యూహకర్తకు చెక్- 30వ తేదీన- నోటీసుల్లో కీలకాంశాలు..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంటోంది. 2023 డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు కూడా సమాయత్తమౌతోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి- ఏకంగా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ కూడా ఎన్నికల కోసం సన్నద్ధమౌతోంది. దీనికోసం ప్రత్యేకంగా వ్యూహకర్తను నియమించుకుంది.

ఎన్నికల వ్యూహకర్తపై దాడులతో..
ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రత్యేకంగా పోల్ స్ట్రాటజీ టీమ్‌ను రూపొందించుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ఈ టీమ్‌కు హెడ్‌గా వ్యవహరిస్తోన్నారు. సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేయడంతో పాటు కాంగ్రెస్ విజయానికి పక్కా ప్రణాళికలను రూపొందించడంలో తలమునకలై ఉందా స్ట్రాటజీ టీమ్.

దాడుల కలకలం..
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీకి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన సునీల్ కానుగోలు కార్యాలయంపై మెరుపుదాడికి దిగారు. ఆయన కార్యాలయం నుంచి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో ఈ దాడులు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు.

సీఆర్పీసీ కింద..
ఇప్పుడు తాజాగా సునీల్ కానుగోలుకు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు నోటీసులను ఇచ్చారు. సెక్షన్ 41 (ఏ) సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దీన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అందుకున్నారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ సునీల్ కానుగోలును ఆదేశించారు పోలీసులు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు.

దర్యాప్తునకు సహకరించాలి..
భవిష్యత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడబోనని హామీ ఇవ్వాలని క్రైమ్ పోలీసులు సునీల్ కానుగోలుకు సూచించారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, తాము అడిగిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే అందకు సహకరించాలని అన్నారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సాక్షులను బెదిరించడం గానీ, సాక్ష్యాధారాలను బయటపెట్టడం గానీ చేయకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications