సదర్ వేడుకల్లో అపశృతి...డిప్యూటీ సిఎం మహమూద్ అలీకి తప్పిన ముప్పు
Recommended Video

హైదరాబాద్:ముషీరాబాద్ లో జరుగుతున్న దీపావళి సందర్బంగా నిర్వహిస్తున్న సదర్ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది.
ఈ వేడుకల్లో ప్రదర్శన కోసం తెచ్చిన రెండు దున్నపోతులు హఠాత్తుగా ఒకదానితో మరొకటి తలపడి ఆ క్రమంలో జనంపైకి దూసుకురావడంతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీని ఆయన భద్రతా సిబ్బంది వెంటనే పక్కకి తప్పించడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనలో మహమూద్ అలీకి చెందిన రెండు వాహనాలు స్పల్పంగా ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే...
దీపావళి వేడుకల్లో భాగంగా ముషీరాబాద్ సత్తర్‌బాగ్‌లో యాదవులు సదర్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎడ్ల హరిబాబు యాదవ్ అనే వ్యక్తి హర్యానా నుంచి యువరాజ్, ధారా, రాజా దున్నపొతులను ప్రదర్శన నిమిత్తం వేడుకల స్థలం వద్దకి రప్పించారు. మరోవైపు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణా రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వచ్చారు.

దున్నపోతుల ప్రదర్శనను తిలకించిన అనంతరం ఆయన స్థానిక నేతలతో మాట్లాడుతున్న సమయంలో స్థానికులు సెల్పీల కోసం పోటీపడ్డారు. అదే సమయంలో ప్రదర్శనలోని రెండు దున్నపోతులు పరస్పరం ఒకదానితో మరొకటి తలపడి...ఆ తరవాత ఒక్కసారిగా డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, జనసందోహం ఉన్నవైపుకు దూసుకువచ్చాయి. దీంతో వెంటనే అప్రమప్తమైన ఆయన భధ్రతా సిబ్బంది, స్థానికులు డిప్యూటీ సిఎం మహమూద్ అలీని సురక్షిత ప్రదేశం వైపు తీసుకెళ్లారు.
అయితే ఆ దున్నపోతులు పరుగులు తీస్తూ అక్కడే నిలిపిఉంచిన డిప్యూటీ సీఎం వాహనాలును ఢీకొట్టడంతో అవి స్వల్పంగా ధ్వంసమయ్యాయి. దీంతో అప్రమత్తమైన కార్యక్రమ నిర్వాహకుడు హరిబాబు యాదవ్ దున్నపోతుల సంరక్షకులను, పోలీసులను వాటిని పట్టుకోవాల్సిందిగా కోరాడు. దీంతో వేడుకలు తిలకించేందుకు హాజరైన దాదాపు 30-40 మంది ఆ దున్నపోతులను వెంటాడి అతి కష్టం మీద వాటిని బంధించారు. అనంతరం డిప్యూటీ సీఎం అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications