ఎన్నికలపై ఏంటిది!: ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఆలస్యం పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిసారి వాయిదా వేయడం సరికాదని ప్రభుత్వానికి చెప్పింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల పైన హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మరో ఆరు నెలల గడువు కోరారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారి గడువు పెంపు సరికాదని చెప్పింది. మీరు నిర్వహిస్తారా లేక మేం జోక్యం చేసుకోవాలా అని ప్రశ్నించింది.

దీనిపై అడ్వోకేట్ జనరల్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలు స్టేట్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. దానికి కోర్టు స్పందిస్తూ.. స్టేట్ కాకపోతే సెంట్రల్ ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పింది. ఇంత గడువు అవసరమా అని ప్రశ్నించింది. లేకుంటే తాము సోమవారం తేల్చుతామని చెప్పింది.
కాగా, డిసెంబర్ నాటికి జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు) నిర్వహిస్తామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం తెలిపింది.
అయితే, అంత సమయం ఇవ్వలేమని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా జీహెచ్ఎంసీ ఎన్నికలపై పలుమార్లు కేసు వాయిదా పడింది. గురువారం తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆరు నెలల గడువు కోరింది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications