హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇకపై పండుగే... 6 కోచ్ ల రైళ్ళు!
హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ నగర ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. లక్షల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలను చేరుస్తూ హైదరాబాద్ లో రద్దీ తగ్గించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గంటల కొద్దీ ప్రయాణాలు చేసే పని లేకుండా నగరంలో వివిధ ప్రాంతాలకు ఫాస్ట్ రవాణా సేవలను అందిస్తుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల పాలిట కల్పవల్లిగా మారింది హైదరాబాద్ మెట్రో.
అటువంటి హైదరాబాద్ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న రైళ్ల స్థానంలో కొత్తగా ఆరు కోచ్‌ల రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.తొలి దశలో 60 కోచ్‌లతో 10 కొత్త రైళ్లను కొనుగోలు చేయనున్నారు. ఒక్కో ఆరు కోచ్‌ల రైలులో సుమారు 2 వేల మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం మూడు కోచ్‌ల రైలులో వెయ్యి మంది వరకు ప్రయాణిస్తున్న సామర్థ్యం దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ కొనుగోలు ప్రక్రియను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) పర్యవేక్షించనుంది. సాంకేతిక ప్రమాణాలు రూపొందించిన తర్వాత టెండర్లు పిలవనున్నారు. రైళ్ల తయారీకి సుమారు 24 నెలలు పట్టే అవకాశం ఉంది.ఒక్కో రైలుకు సుమారు రూ.62 కోట్లు ఖర్చవుతుంది.
మొత్తం కొనుగోలు వ్యయం రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. మెట్రో స్టేషన్లను ఇప్పటికే ఆరు కోచ్‌ల రైళ్లకు అనుగుణంగా నిర్మించినందున ప్లాట్‌ఫామ్‌ల పొడిగింపు వంటి అదనపు పనులు అవసరం లేదు.ప్రస్తుతం రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలుగా ఉంది. కొత్త రైళ్ల రాకతో ఈ సంఖ్య 6 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో అమీర్‌పేట-రాయదుర్గం మార్గంలో తీవ్ర రద్దీ నెలకొంటోంది. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఒకట్రెండు రైళ్లను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. కొత్త రైళ్లతో రద్దీ తగ్గడంతోపాటు ప్రజా రవాణా వైపు ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు దృష్టి పెట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
