విమానంలో హైదరాబాద్, విశాఖలకు వచ్చి.. దొంగతనాల్లో సెంచరీ కొట్టారు!
హైదరాబాద్: ఒడిశా నుంచి విమానంలో వచ్చి నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు అరెస్టు చేశారు. వీరు సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధితో పాటు విశాఖలోను గత మూడేళ్లలో 100 చోరీల వరకు పాల్పడ్డారు.
వీరు ఎనిమిది కిలోల బంగారం దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం నాడు మాదాపూర్ డీసీపీ కార్తికేయ, కూకట్ పల్లి ఏసీపీ భుజంగ రావులు వారిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. వారి గురించిన విషయాలను పోలీసులు వెల్లడించారు.

విమానంలో వస్తారని, కారులో తిరుగుతారని, తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతారని చెప్పారు. వీరు దాదాపు వందకు పైగా చోరీలు చేశారని చెప్పారు. ఒడిశా బరంపురం ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కుమార్, సుశాంత కుమార్ పాణిగ్రాహి, ప్రేమ్‌నంద్ ప్రార్థన్ స్నేహితులు.
సొంత రాష్ట్రంతో పాటు విశాఖపట్నం, హైదరాబాద్‌లో దాదాపు పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడ్డారు. ఒడిశా నుంచి విమానంలో వచ్చి స్థానికంగా ఓ కారును అందుబాటులో ఉంచుకుని తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తారు. గత మూడేళ్లలో కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఛైతన్యపురి, వనస్థలిపురం, హుమయూన్‌నగర్, పంజాగుట్ట, బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 42చోట్ల జరిగిన చోరీల్లో వీరికి ప్రేమయం ఉన్నట్లు గుర్తించారు.
ఆయా చోరీల్లో సుమారు ఎనిమిది కిలోల బంగారు అభరణాలు దొంగిలించారని భావిస్తున్నారు. కాగా, వీరు వారం క్రితం ఎస్సార్ నగర్‌లోని ఓ హోటల్లో బస చేశారు. ప్రగతి నగర్ సమీపంలో ఓ కారులో తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఆరు సెల్ ఫోన్లు, రూ.8లక్షలు విలువచేసే బంగారు అభరణాలు, మారుతి వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications