ఉప్పొంగుతున్న మున్నేరువాగు; హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్; తెలంగాణా ఆర్టీసీ అలెర్ట్!!
తెలుగు రాష్ట్రాలను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు, వరదలు కారణంగా రహదారుల పైన డేంజర్ లెవెల్లో వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఏపీ, తెలంగాణాలలో అనేకచోట్ల వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జనగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కోదాడ నుండి హుజూర్నగర్, మిర్యాలగూడ మీదుగా దారి మళ్లిస్తున్నారు.

మున్నేరు వాగు కు వరద పోటెత్తడంతో పాటు, ఖమ్మం జిల్లా నుంచి దిగువకు వరద వస్తుండడంతో జాతీయ రహదారికి ఆటంకం ఏర్పడింది. దీనితో కోదాడ - హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఐతవరం సమీపంలో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సు సర్వీసుల విషయంలో ప్రయాణికులను అలర్ట్ చేస్తుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో సజ్జనార్ హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రభావం గురించి పేర్కొన్నారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక అంటూ పేర్కొన్న సజ్జనార్ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోందని, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ ఆర్టీసీ రద్దు చేసిందని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోందని వెల్లడించారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications