ఆంధ్రావాళ్లు వెళ్లిపోయేలా చేసి.. కెటిఆర్‌కు కౌంటర్: 'ఆంధ్రావాళ్లని తిట్టింది జోకేనా'
హైదరాబాద్: తెలంగాణలో ముప్పై శాతం జనాభా హైదరాబాదులోనే ఉన్నారని, వారికి కనీస వసతులు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని మంత్రి కెటి రామారావు సోమవారం నాడు అన్నారు. హైదరాబాదులో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.
హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అన్నారు. దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణను నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, గతంలో పరిపాలన ప్రజలు ఆశించిన మేర జరగలేదన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ముఖ్యమని చెప్పారు.
తమ ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నో పుకార్లు జరిగాయని, కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రధాన ఆర్థిక వనరుగా హైదరాబాద్ నిలుస్తోందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు.

గత పాలకుల హయాంలో వారానికి రెండు రోజులు పవర్ హాలీడేలు ఉండేవని, కరెంట్ సమస్యలతో పారిశ్రామికవేత్తలు రోడ్లపై ధర్నాలు చేశారని, ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ సమస్య లేకుండా చేశామన్నారు. అన్ని విధాలా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంద సీట్లు తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. యాభై ఏళ్లలో చేయలేదని తాము అయిదేళ్లలో చేసి చూపిస్తామన్నారు. బిజెపి, కాంగ్రెస్, టిడిపులు తమకు శత్రువులు కాదని, కేవలం సైద్ధాంతిక విభేదాలే ఉన్నాయన్నారు. అందరితో స్నేహమే తెరాస ఉద్దేశ్యమన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)ను అవసరమైతే తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని, తాను భీమవరంలో పోటీ చేస్తానని ఇటీవల కెటిఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆయన సరదాగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై బిజెపి శాసన సభా పక్ష నేత లక్ష్మణ్, టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను జోకు చేస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కెటిఆర్ అంటున్నారని, మరి హైదరాబాదుకు వారు చేస్తానని చెబుతున్నవి కూడా జోకులుగా తీసుకోవాలా అని డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణకు దళితుడిని మొదటి సీఎంగా చేస్తానని కెసిఆర్ చెప్పారని, లంకలో పుట్టిన వారంతా రాక్షసులేనని నాడు కెసిఆర్ అన్నారని.. ఇవన్నీ జోకులుగా తీసుకోవాలా అని నిలదీశారు.
టిడిపి నేత నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ... 'మీ తండ్రి కెసిఆర్ రాజకీయాల్లో బ్రోకర్ అయితే, మీరు జోకర్ పాత్ర నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్ర సమితి, ఆంధ్రాలో పోటీ అంటూ జోకులు చెబుతున్న మీరు.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వారం రోజులుగా చేస్తున్న ప్రసంగాలు జోకులేనా. ఆంధ్రావాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని జోకులు పేలుస్తున్నార'ని నిలదీశారు.
మంత్రిస్థాయిలో ఉండి జోకులు వేయడం ఆపితే మంచిదని హితవు పలికారు. సమగ్ర సర్వే పేరుతో ఆంధ్రా వాళ్ల వివరాలు సేకరించి, మొదటి దఫాలో 7.9 లక్షల ఆంధ్రావాళ్ల ఓట్లను తొలగించడంతో పాటు మరో 19 లక్షళ మంది ఓఠ్ల తొలగింపుకు నోటీసులు సిద్ధం చేసింది నిజం కాదా అని నిలదీశారు.
ఆంధ్రావాళ్ల లెక్కలు తేల్చేందుకే నాడు సమగ్ర సర్వే చేశారని ఆరోపించారు. హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల్లోని లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులను పంపించడమే లక్ష్యం అని నాడు సీఎం పీఆర్వో అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. సర్వే ద్వారా ఆంధ్రావాళ్ళు వాళ్లంతట వాళ్లే వెళ్లేలా చేయడమే లక్ష్యమని చెప్పలేదా అన్నారు.












Click it and Unblock the Notifications