HYDRAA: హైడ్రా ఛీఫ్ రంగనాథ్ తొలగింపుపై హైకోర్టు కీలక నిర్ణయం..!
హైదరాబాద్ లో అక్రమ కట్టడాల తొలగింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) ను.. తమ ఆదేశాలను పదే పదే ధిక్కరిస్తున్నారన్న కారణంతో హైకోర్టు పక్కనబెట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్న తీరు ఆధారంగా హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే వీటిపై రంగనాథ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక తీర్పు వెలువరించింది.
హైదరాబాద్ లోని శాంతా శ్రీరాం కన్ స్ట్రక్షన్స్ కేసులో హైడ్రా కమిషనర్ గా ఉన్న ఏవీ రంగనాథ్ ను ఆ పదవి నుంచి తప్పించి, మరొకరిని నియమించాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ఇవాళ తాత్కాలికంగా పక్కనబెట్టింది. ఈ మేరకు రంగనాథ్ కు భారీ ఊరటనిచ్చింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కొత్త హైడ్రాఛీఫ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

హైడ్రా ఛీఫ్ గా ఉన్న రంగనాథ్.. మల్కాజిగిరి మండలం లోతుకుంటలో కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ శాంతా శ్రీరాం కన్ స్ట్రక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించారంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్.. గతంలో రంగనాథ్ పదే పదే హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించడాన్ని సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా ఏడాదిన్నరలో 63 కోర్టు ధిక్కారణ పిటిషన్ లు ఆయనపై నమోదు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో రంగనాథ్ ను తప్పించి మరో సమర్ఢుడైన అధికారిని హైడ్రా ఛీఫ్ గా నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో రంగనాథ్ కు ఇవాళ ఊరట లభించింది.














Click it and Unblock the Notifications