రేవంత్ వస్తే ఇష్టమైనవన్నీ వండిపెడతా.: కుమారి ఆంటీ హ్యాపీ
హైదరాబాద్: నగరంలో ఫుడ్ స్టాల్ నడిపిస్తున్న కుమారి ఆంటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు. సోషల్ మీడియాలో అయితే, గత రెండు మూడు రోజుల నుంచి #kumriaunty ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. రుచికరమైన భోజనం అందుబాటు ధరలో అందించడంతో ఫేమస్‌గా మారింది కుమారి ఆంటీ. దీంతో అనేక మంది ఆమె ఫుడ్ స్టాల్ వచ్చి లంచ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో స్టాల్ వద్ద రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్‌కు కారణం కావడంతో పోలీసులు ఆమె స్టాల్‌ను మూసివేశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీ కుటుంబసభ్యులతో పోలీసులకు వాగ్వాదం జరిగింది. తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తన కొడుకు కొట్టారని కుమారి ఆంటీ తెలిపారు. తమకు ఉపాధి లేకుండా చేయడం అన్యాయమని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేసింది.

సోషల్ మీడియాతోపాటు ప్రముఖ మీడియా ఛానళ్లలోనే ఈ వార్త ప్రసారం కావడం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ కుమారి ఆంటీ విషయంపై వెంటనే స్పందించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను అక్కడే నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక, ఆమె స్టాల్‌ను సందర్శిస్తానని కూడా సీఎం రేవంత్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు. బండిని సీజ్ చేయడంతో 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయ్యిందని వాపోయారు. తన కొడుకును పోలీసులు కొట్టారని, మళ్లీ హోటల్ తెరుస్తామని అనుకోలేదన్నారు. తనలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ మహిళపై సీఎం స్పందించడం గొప్ప విషయమన్నారు. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
సీఎం రేవంత్ వస్తే.. ఆయనకు ఇష్టమైనవన్నీ వండి పెడతానని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. కాగా, త్వరలోనే సీఎం రేవంత్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ సందర్శించనున్నారు. అదే జరిగితే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు ఓ రేంజ్‌లో పబ్లిసిటీ వస్తుంది. ఈ క్రమంలో కుమారి ఆంటీని తగిన సాయం అందించి హోటల్ పెట్టుకునేందుకు సహకరించాలని పలువురు సీఎంను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications