నా ఫోన్ కూడా ట్యాప్ అవుతోంది- అమిత్ షా, సీజేఐతో మాటలను చాటుగా వింటోన్నారు..!!
ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ ఫోన్ ట్యాపింగ్ వివాదం చెలరేగింది. తన ఫోన్ ను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాప్ చేయిస్తోన్నారంటూ ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు.
హైదరాబాద్: మొన్నటి వరకు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వివాదం ఉవ్వెత్తున చెలరేగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ కారణంతోనే తాను పార్టీకి దూరమౌతున్నట్లు ప్రకటించారు. ఈ వివాదంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాస్తాననీ ప్రకటించారాయన.

తెలంగాణలో ట్యాపింగ్..
తాజాగా తెలంగాణలోనూ ఇదే తరహా వివాదం తలెత్తినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తన ఫోన్ ను ట్యాప్ చేయిస్తోన్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. కేంద్ర మంత్రులతో తాను ఏం మాట్లాడుతున్నాననేది చాటుగా వింటోన్నారని విమర్శించారు. అమిత్ షాతో తాను తరచూ ఫోన్ లో మాట్లాడుతుంటానని, దాన్ని తెలుసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తోన్నారని చెప్పారు.

ఏప్రిల్ లోనే..
కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించే విషయంలో తాను చెప్పిందే జరిగిందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయ భవనాన్ని ప్రారంభించకూడదని తాను ఇప్పటికే హెచ్చరించానని గుర్తు చేశారు. ఈ భవనాన్ని ప్రారంభించడానికి ఇంకో తేదీని నిర్ధారించాల్సి వస్తే- రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14వ తేదీయే కావాలని డిమాండ్ చేశారు.

చెప్పిందే జరిగింది..
ఏప్రిల్ 14వ తేదీ కాకుండా మరో తేదీని ఖరారు చేస్తే- కేసీఆర్ ఇంకా ఎక్కువగా బుద్ధి చెబుతామని కేఏ పాల్ హెచ్చరించారు. ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయం భవనాన్ని ప్రారంభించొద్దంటూ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తోన్నప్పటికీ ఒకదశలో కేసీఆర్ వినిపించుకోలేదని చెప్పారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభోత్సవం వాయిదా పడిందని అన్నారు.

కేసీఆర్ కు ఎలా తెలుసు..
తాను ఢిల్లీ వెళ్లిన విషయం కేసీఆర్ కు ఎలా తెలిసిందని కేఏ పాల్ ప్రశ్నించారు. తన ఫోన్ ను ట్యాప్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆరోపించారు. కేంద్రంలో తాను ఏ మంత్రితో మాట్లాడుతున్నాననేది కేసీఆర్ వింటోన్నారని విమర్శించారు. ఢిల్లీలో తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లాననే విషయం తెలంగాణ ప్రభుత్వానికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు.

ఎన్ని కావాలంటే అన్ని ట్యాపింగులు..
కేసీఆర్ ఎన్ని ట్యాపింగులు చేసినా తనకేమీ అభ్యంతరం లేదని, ఇందులో దాపరికం ఏదీ లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పటివరకు తాను మూడు కేసులు వేసి, మూడింట్లోనూ గెలిచానని అన్నారు. తెలంగాణలో 70 శాతం మంది తనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటోన్నారని కేఏ పాల్ పేర్కొన్నారు.

70 శాతం
భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించిన తరువాత కేసీఆర్ ఇక గెలిచే ప్రసక్తే ఉండదని అన్నారు. బడుగు, బలహీన ప్రభుత్వం ఏర్పాటవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అయిదు లక్షల కోట్ల రూపాయల అప్పును తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తన వల్లే సాధ్యపడుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications