క్షణం మిస్ అవకుండా కేసీఆర్ ప్రసంగం విన్నా-ఇక ఆయన చచ్చిన పాము,ఇదే చివరి పొలిటికల్ స్పీచ్-రేవంత్ సంచలనం
తెలంగాణ వస్తే దళితులకు రాజ్యాధికారం ఇస్తానని చెప్పిన కేసీఆర్... ఉద్యమ కాలంలో వారి త్యాగాలను,పోరాటాలను ఒక పాచికగా వాడుకుని వదిలేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నడూ అంబేడ్కర్,జగ్జీవన్ రామ్‌లకు దండ వేసింది లేదు,దండం పెట్టింది లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,మూడెకరాల భూమి,దళిత గిరిజనులకు ఉద్యోగాల పేరుతో కేసీఆర్ వారిని మోసం చేశారని ఆరోపించారు. ఏడున్నరేళ్ల పాలనలో ఒక్కసారి కూడా దళితులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించలేదన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ కమిటీలను కూడా నియమించలేని దుస్థితిలో పాలన సాగుతోందన్నారు. ప్రజలందరు కలిసి కలుగులో ఉన్న ఎలుకకు పొగ పెడితే అది బయటకొచ్చినట్లు... ఇప్పుడు కేసీఆర్ బయటకొచ్చారని ఎద్దేవా చేశారు.
Recommended Video

ఒక్క క్షణం మిస్ అవకుండా ప్రసంగం విన్నాను : రేవంత్
ఇవాళ హుజురాబాద్ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఒక్క క్షణం కూడా మిస్ అవకుండా విన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు అంబేడ్కర్,జగ్జీవన్‌రామ్‌లను చిన్న చూపు చూసినందుకు... కేసీఆర్,ఆయన కుటుంబ ధన దాహానికి బలైపోయిన నేరెళ్ల బిడ్డలను చిత్రహింసలకు గురిచేసినందుకు... ఖమ్మంలో మిర్చి గిట్టుబాటు ధర అడిగిన గిరిజన రైతులకు బేడీలు వేసినందుకు... ఇటీవల మరియమ్మ అనే దళిత మహిళను పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసి చంపినందుకు... వీటన్నింటికీ కేసీఆర్ క్షమాపణలు చెప్పి తన ప్రసంగం మొదలుపెడుతాడేమోనని ఆశించినట్లు చెప్పారు. కానీ నరనరాన నమ్మించి మోసం చేసే విధానాన్ని అలవరుచుకున్న కేసీఆర్.. హుజురాబాద్ సభలోనూ మళ్లీ అబద్దాలే చెప్పారని విమర్శించారు. నెక్లెస్ రోడ్‌లో ప్రపంచమే అబ్బురపడేలా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడుతానని చెప్పిన కేసీఆర్.. ఇప్పటివరకూ అక్కడ తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు.

ఇక ఆయన చచ్చిన పాము : రేవంత్ రెడ్డి
దళిత బంధు సభలో కేసీఆర్ మాటలు విని చాలా జాలి కలిగిందని రేవంత్ అన్నారు. ఈరోజు నుంచి ఆయన చచ్చిన పాములాంటి వాడని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ నీచమైన రాజకీయాలకు ఆయన సతీమణి శోభమ్మకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటిది ఉపఎన్నికలో గెలిచేందుకు శోభమ్మను కూడా తెర పైకి తెచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇది కేసీఆర్ స్థాయికి తగదని వ్యాఖ్యానించారు. తాను చేసిన పాపాలను కడుక్కోవడానికే కేసీఆర్ తన సతీమణి ప్రస్తావన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల సురేశ్ నాయక్, లావణ్య లాంటి విద్యార్థులెందరో ఆత్మబలిదానం చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్య చేయించిన నీచపు చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. దళితబంధు పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు.

కేసీఆర్‌కు ఇదే చివరి రాజకీయ ప్రసంగం : రేవంత్ రెడ్డి
కేసీఆర్‌కు ఇదే చివరి రాజకీయ ప్రసంగంగా భావిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. అబద్దాల పునాదుల మీద బీటలు వారుతున్న గులాబీ కోటలను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంబేడ్కర్ పేరు మీద చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి కేసీఆర్ ఏనాడైనా మాట్లాడారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లో మట్టిని కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని ఆరోపించారు. చెరువుల్లో మట్టిని అమ్ముకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ ఇవేవీ ప్రజల కోసం కాదన్నారు. కేవలం ప్రజాధనం దోచుకోవడానికే ఈ ప్రాజెక్టులను చేపట్టారని ఆరోపించారు.

ఈ నెల 18 తర్వాత హుజురాబాద్‌పై దండెత్తుతాం : రేవంత్ రెడ్డి
ఈ ఏడేళ్ల పాలనలో దళిత గిరిజనులకు ఒక్క పైసా దక్కలేదన్నారు. ఒక్క శాసనసభ స్థానం గెలిచేందుకు కేసీఆర్ పూర్తిగా దిగజారిపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దళిత గిరిజనులు విద్య,ఉద్యోగాలకు దూరమయ్యారని ఆరోపించారు. దళిత బంధుపై అసెంబ్లీలో ఒకరోజు చర్చ నిర్వహించి తీర్మానం చేయాలన్నారు. ఆర్నెళ్ల లోపు రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలన్నారు. హుజురాబాద్‌లో త్వరలో తుఫాను రాబోతుందని... అందులో కేసీఆర్ కొట్టుకుపోతారని హెచ్చరించారు. ఈ నెల 18న ఇబ్రహీపట్నంలో దళిత,గిరిజన సభ తర్వాత హుజురాబాద్‌పై దండెత్తుతాం అన్నారు. ఇవాళ కేసీఆర్ సభ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ జరుగుతుందన్నారు.

దళిత బంధు ప్రారంభించిన సీఎం కేసీఆర్...
హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఎన్నో కీలకమైన పథకాలను కరీంనగర్ నుంచి ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళిబంధు నిధులు ఇస్తామని చెప్పారు. అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలే అని... వారి జనాభా 75 లక్షలు ఉందన్నారు. అతి తక్కువ ఆస్తులు, భూములు,అతి తక్కువ ఉపాధి, ఆదాయం ఉన్నవారు కూడా ఎస్సీలే అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అయితే ప్రజలు ప్రభువులు అయితే దళితులు ఎందుకు ప్రభువులుగా లేరని ప్రశ్నించారు. ఎఎస్సీల పట్ల వివక్ష ఇంకెన్ని కొనసాగాలని ప్రశ్నించారు. 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ. 2 వేల కోట్లు మంజూరు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని సీఎం తెలిపారు. రాష్ట్రమంతా అమలు చేస్తే ఖర్ఛయ్యేది రూ. 1.30 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. నిధులకు భయపడకుండా దళిత బంధు అమలు చేస్తామని తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులకు చివరి దశలో దళిత బంధు అమలు చేస్తామని కూడా తెలిపారు. దళిత బంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చని అన్నారు. దళిత బంధు కింద ఇచ్చే డబ్బులకు కీస్తిల కిరికిరి లేదన్నారు. దళిత బంధు డబ్బులు 100 శాతం సబ్సిడీతో ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. దళిత బంధు నిధులతో ఎక్కడైన సరే వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి కూడా...
ప్రభుత్వ ఉద్యోగం ఉన్న దళితులకు కూడా దళితబంధును వర్తింపజేస్తామని కేసీఆర్ తెలిపారు. 'హుజూరాబాద్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో దళిత బంధు డబ్బులు ఇస్తాం. హుజూరాబాద్‌లో అందరికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలి. 25 ఏండ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని ప్రారంభించాం. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాటలు రూపొందించాం. 25 ఏండ్ల నుంచి నా మస్తిష్కంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అణగారిన, అణిచివేయబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో దళితుల మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివక్షకు గురయ్యాయి. అంబేద్కర్ పోరాటం వల్ల అన్ని పదవుల్లో రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు లభించాయి.' అని సీఎం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications