శ్రీతేజ్‌ను పరామర్శించా, కానీ..: జగపతి బాబు ఏమన్నారంటే?
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలైన విషయం విదితమే. ప్రస్తుతం శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇటీవల సినీనటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను పలువురు సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించని సినీ ప్రముఖులు.. అల్లు అర్జున్‌ను పరామర్శించడంపై సీఎం సహా పలువురు రాజకీయ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు.

ఈ నేపథ్యంతో సినీనటుడు జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని తాను ఆస్పత్రికి వెళ్లానని.. అయితే, పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టే విషయం ఎవరికీ తెలియదన్నారు జగపతి బాబు.
'అందరికీ నమస్కారం. ఓ క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నా. నేను సినిమా షూటింగ్ నుంచి రాగానే.. సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లా. బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలనిపించి అక్కడికి వెళ్లా. ఆ దేవుడు, అందరి ఆశీస్సులతో త్వరగానే బాలుడు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చి వచ్చాను. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది ఆ కుటుంబం కాబట్టి.. నా వంతు సపోర్ట్ ఇవ్వాలనుకున్నా. పబ్లిసిటీ చేయలేదు. కాబట్టి విమర్శలు వచ్చాయి. క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు పెడుతున్నా' అని జగపతి బాబు ఓ వీడియో విడుదల చేశారు.
— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024
అయితే, అల్లు అర్జున్ తండ్రి, సినీ నిర్మాత అల్లు అరవింద్ కొద్ది రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందున న్యాయనిపుణుల సలహా మేరకు తాను శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోతున్నానని శనివారం మీడియా సమావేశంలో అల్లు అర్జున్ వెల్లడించారు. తన తండ్రితోపాటు సినిమా యూనిట్ కు సంబంధించిన వ్యక్తులు శ్రీతేజ్ కుటుంబాన్ని కలిశారని చెప్పారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications