వంద కేసులైనా ఎదుర్కుంటా: ఏసీబీ విచారణపై కేటీఆర్ కామెంట్స్
తనపై వంద కేసులు పెట్టినా ఎదుర్కుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారని.. అలా 82 ప్రశ్నలు అడిగారని చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు పెట్టించారని ఏసీబీ అధికారులకు కూడా అర్థమైందన్నారు.
కేసులో ఎలాంటి విషయం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్ అనేదాన్ని తొలిసారి ఇండియాకు తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో కొనసాగించాలని భావించామన్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణకు భవిష్యత్తులో ఈవీ రంగంలో పెట్టుబడులు వస్తాయనే సదుద్దేశంతో పనిచేశామని తెలిపారు.

ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి లేదని.. అవినీతి పనులు తాము చేయమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తప్పకుండా వస్తానని తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏసీబీ అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. ఇలాంటివి మరో వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు.
తమపై ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా ఈ ఏడాదంతా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నేతృత్వంలో ఎంతో నిబద్ధతతో, ఎక్కడా అవినీతి లేకుండా పనిచేశామని చెప్పారు.
కాగా, ఫార్ములా వన్ ఈ కారు రేసింగ్ కేసులో భాగంగా గురువారం కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. సుమారు ఏడు గంటలపాటు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. మరోసారి విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన మరోసారి ఏసీబీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications