కాంగ్రెస్‌లోకి మైనంపల్లి హనుమంతరావు, అప్పుడే: మూడు టికెట్లపై గురి!
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రకటించారు. సెప్టెంబర్ 27లోపు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో హస్తం పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, తదితర నేతలు ఆయనతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు మైనంపల్లి హనుమంతరావు. ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దల సమక్షంలో సెప్టెంబర్ 27 లోపు చేరతానని చెప్పారు. మెదక్‌లో తన కుమారుడికి మంచి ఆదరణ ఉందని తెలిపారు. తమ కార్యకర్తలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సర్వేలో అనుకూలంగా ఉంటే ఇద్దరికీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు వెల్లడించారు. అంతేగాక, తన తరపున నక్క ప్రభాకర్‌కు మేడ్చల్ టికెట్ అడిగినట్లు వివరించారు.

అంతకుముందు దామోరద రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మైనంపల్లితో తమకు రాజకీయాలకు అతీతంగా సంబంధాలున్నాయని తెలిపారు. మైనంపల్లి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీల సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు పార్టీలో చేరతారని చెప్పారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠకు నేటితో తెరపడినట్లయింది.

ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని మైనంపల్లి అన్నారు. ప్రశ్నించిన నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు, తన కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నామన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా నెనుకాడబోమని అన్నారు.












Click it and Unblock the Notifications