talasani srinivas yadav andhra pradesh chandrababu naidu ys jagan pawan kalyan sankranthi makara sankranthi తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి మకర సంక్రాంతి
ఏపీకి వచ్చి రాజకీయాలు వద్దని టీడీపీ నేతలు చెప్పారు, కానీ అందుకే కచ్చితంగా మాట్లాడుతా: తలసాని
విజయవాడ/హైదరాబాద్: ఈ ప్రాంతానికి (ఆంధ్రప్రదేశ్) వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు తనతో చెప్పారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం చెప్పారు. కానీ తాను తప్పకుండా రాజకీయాలే మాట్లాడుతానని చెప్పారు. సంక్రాంతి వేడుకలు, కోడి పందాల కోసం తలసాని ఏపీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీనిని టీడీపీ నేతలు తప్పుబట్టారు. అనంతరం తలసాని మళ్లీ ఈ రోజు మాట్లాడారు. తాను ఏపీలో కచ్చితంగా రాజకీయాలు మాట్లాడుతానని, ఎందుకంటే తాను ఏపీ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఏపీలో గ్రాఫిక్స్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టును కట్టారని చెప్పారు.

తాము ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని తలసాని చెప్పారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని, అందుకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉందని చెప్పారు. దేశంలో ఏపీనే అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. 24 గంటలు విద్యుత్ ఇస్తున్న మా పరిపాలన గొప్పదా లేక దేశంలో అవినీతిలో నెంబర్ వన్‌గా నిలిపిన టీడీపీ పాలన గొప్పదా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీకి (తెరాస) వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేశారని, దానికి బదులుగా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని అంతకుముందు రోజు అన్నారు. ఏపీ ప్రభుత్వ పనితీరు ఆశాజనకంగా లేదన్నారు. రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటుంటే చంద్రబాబు వారికి బాహుబలి సినిమా చూపిస్తున్నారన్నారు.
తెలంగాణలో ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సొమ్ముతో చంద్రబాబు సొంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. హైటెక్ సిటీలో ఒక్క భవనం నిర్మించి అంతా తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటుంటే, చంద్రబాబు మాత్రం ఒక్కోసారి ఒక్కో విధంగా మాట మారుస్తున్నారని, హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. పథకాలను కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేసినందువల్లే రెండోసారి గెలిచారని, ఏపీలో టీడీపీ మళ్లీ గెలవడం కష్టమని చెప్పారు.