అవకాశం ఇస్తే తెలంగాణ, ఏపీని కలిపేస్తారు.. బీజేపీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టి ఏడున్నారేళ్లయినా తెలంగాణకు చేసిందేమి లేదని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వకపోగా.. ఎలాంటి ప్రాజెక్టులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ము ధైర్యం బీజేపీ నేతలకు, కేంద్రానికి ఉందా ? అని కేటీఆర్ నిలదీశారు.

ఉత్తర భారతదేశానికే మోదీ ప్రధానమంత్రా?
మోదీ కేవలం ఉత్తర భారతదేశానికే ప్రధాన మంత్రా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం సిద్ధాపూర్‌లో రిజర్వాయర్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా మొత్తం 157 వైద్యకళాశాలను కేంద్రం మంజూరు చేస్తే.. వాటిల్లో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఐఐఎంలు, నవోదయ పాఠశాలలు ఇవ్వలేదన్నారు. వీటిని కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.

తెలంగాణను ఏపీలో కలిపినా కలిపేస్తారు..
తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకను మోదీ ప్రశ్నిస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటి పార్టీలు మనకు అవసరమా అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. బీజేపీ, మోదీకి మరో సారి అవకాశం ఇస్తే తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా కలిపేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు..

ప్రభుత్వ సంస్థల అమ్మకాలు..
దేశంలోని వ్యవస్థలను నిర్విర్యం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలైన రైల్వేలు, ఎయిరిండియా, ఎల్ఐసీ లాంటి అనేక సంస్థలను ప్రధాని మోదీ తన అనుచరులకు అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ పాలనలో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications