భారీ వర్షాలు, ఈ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ - బీ అలర్ట్, తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఫలితంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల రహదారులు ధ్వంసం కాగా, వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించగా, అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని అలర్ట్స్ జారీ అయ్యాయి.
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో, ప్రభుత్వం జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం(ఆగస్టు 19) మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రధానంగా గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలకు తోడు భారీగా వరదలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం నాడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల వేళ ప్రభుత్వం అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముందస్తు చర్యలు చేపట్టింది. మెదక్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. రవాణా వ్యవస్థ పైన భారీ వర్షాలు ప్రభావం చూపుతున్నాయి.












Click it and Unblock the Notifications