ఆ కోరిక తీర్చుకోవాలంటే.. ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి గెలవాల్సిందే!!
తెలంగాణాలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కాంగ్రాస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవితవ్యం మరో వారం రోజుల్లో తేలనుంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ ప్రచారం చేసుకుంటున్న కోమటిరెడ్డి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో పని చేస్తున్నారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన కోమటిరెడ్డి గత ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
నల్లగొండలో తనకు తిరుగు లేదనుకున్న వెంకటరెడ్డి ఓడిపోవడంతో ఆ తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నిలలో భువనగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. అక్కడ ఎంపి గా ఉన్నప్పటికీ ఆయన ఫోకస్ అంతా నల్లగొండ మీదనే పెట్టారు. తరచుగా నల్లగొండకు వస్తూ పోతూ క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది అధికార పార్టీ బిఆర్ఎస్ లోకి వెళ్ళటంతో కొంత సంయమనం పాటించారు.

ఈ సమయంలో బిజెపిలోకి వెళ్తాడంటూ పుకార్లు కూడా వ్యాపించాయి. సాధారణంగా ఎవరికీ దొరకని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అనుకున్న వెంటనే కోమటిరెడ్డి కి దొరకడం, ప్రధానితో భేటి కావడం వంటి పరిణామాలతో అందరూ ఆయన కాంగ్రెస్ ను వీడి బిజెపిలోకి వెళ్తాడనే అనుకున్నారు. కానీ ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి తరపున ఎన్నికలబరిలో నిలిచి ఓటమి పాలయ్యారు.
ఈ పరిణామాలు అన్నింటిని గమనించిన కోమటిరెడ్డి కొంత వెనుకడుగు వేసినట్లు చెప్పుకుంటారు. పరిణామాలు ఏవైనా వెంకటరెడ్డి పార్టీ మారకుండా కాంగ్రెస్లోనే ఉంటూ తన అనుచరులకు కూడా టిక్కెట్లు ఇప్పించుకొని ఎన్నికలబరిలో నిలిచారు. అయితే గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి బిజెపి కూడా ప్రభావం చూపిస్తుంది.అధికార బిఆర్ఎస్ లో బహిష్కృత నేత, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇస్తున్నారు.
ప్రధానమంత్రి మోడీ బిసి ముఖ్యమంత్రి అని చెప్పడంతో స్ధానిక బిసి ఓటరల్లో కొంత కదలిక రావడంతో నల్లగొండలో ఇద్దరు బిసి అభ్యర్ధులు కూడా తమ ప్రభావం చూపించనున్నారు. దీంతో ఓట్లు చీలే అవకాశం ఉండటంతో ఎవరు గెలుస్తారు అనేది ఊహకందని విధంగా మారింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కోరిక తీరాలంటే ఈ ఎన్నికలలో గెలవక తప్పని పరిస్ధితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications