నిర్మాత సహా బ్యాంక్ దోపిడీ ముఠా అరెస్ట్, దోచేసి సినిమాల్లో పెట్టుబడి
హైదరాబాద్: బ్యాంకుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ప్రధాన నిందితుడు మురుగున్ సినిమాల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. అతను మనసా వినవా అనే చిత్రానికి నిర్మాత అని తెలుస్తోంది.
ఘట్‌కేసర్‌లో జరిగిన బ్యాంక్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మురుగన్ సహా ముగ్గురుని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.72 కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.
మురుగన్ ప్రొడక్షన్ పేరుతో అతను సినిమాలు నిర్మిస్తున్నారు. మానసా వినవా, ఆత్మ సినిమాలకు పెట్టుబడి పెట్టారు. అంతేకాదు, సౌతిండియా ఫిల్మ్ గిల్డ్‌లో మురుగన్‌కు సభ్యత్వం కూడా ఉంది.
మురుగున్ ముఠా ఘట్‌కేసర్ గ్రామీణ బ్యాంకులో రూ.36 లక్షలు దోచుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో రూ.4కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు సభ్యుల చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ పోలీసులు మంగళవారం నాడు ముగ్గురు సభ్యుల చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి రెండున్నర కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
చిట్టీల పేరుతో మోసం
చైతన్యపురి వీవీనగర్‌లో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. కుషాల్ రెడ్డి అనే వ్యక్తి మహిళల వద్ద చిట్టీల పేరుతో డబ్బులు వసూళ్లు చేశాడు. అయితే రెండున్నర కోట్లు అయిన తర్వాత ఎవరికీ చెప్పాపెట్టకుండా పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధిత మహిళలు కుషాల్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుషాల్ రెడ్డి నివాసం ఎదుట మహిళలు ధర్నా చేశారు.
వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద ఓ వాటర్ ట్యాంక్ కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఓ ప్రయివేటు కార్యక్రమం జరుగుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications