తెలంగాణ నెత్తిన నీళ్లు కుమ్మరించిన వాతావరణశాఖ
ఎండలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అకాల వర్షంతో వారికి కాస్తంత మేలు జరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే వాతావరణశాఖ తెలంగాణ ప్రజలకు శుభవార్త వినిపించింది. రానున్న మూడురోజులు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం నుంచే హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచాయి. నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రజలంతా కాస్తంత రిలాక్సయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడ్డాయి.
మరో మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 12 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వడగండ్ల వానలకు పంట నష్టం వాటిల్లింది. హన్మకొండ, వరంగల్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించారు.

గంటకు 50 నుంచి 60 కిలోమీట్లర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 19 రాత్రి నుంచే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇప్పటికే వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మామిడి, వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రానున్న 24 గంటల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు యథావిధిగానే కొనసాగే అవకాశం ఉందని, ఆయా జిల్లాల్లోని ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పనివుంటేనే బయటకు వెళ్లాలని, లేదంటే వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications