తెలంగాణకు అద్భుతమైన రైల్వే ప్రాజెక్టు ప్రకటించిన కేంద్రం
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు మెరుపు వేగంతో పరుగులు తీస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. దీనిలో భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అసనసోల్ నుంచి తెలంగాణలోని వరంగల్ వరకు రైల్వేకారిడార్ ను ప్రకటించింది. దీని పొడవు 1316 కిలోమీటర్లు కాగా ఏపీలో 85.5 కిలోమీటర్లు, తెలంగాణలో 19.77 కిలోమీటర్లు ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తూర్పు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మార్గం నిలుస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.
బొగ్గు సరఫరా ప్రధానం
ఈ ప్రాజెక్టులో భాగంగా మల్కన్‌గిరి-పాండురంగాపురం మధ్య నూతన మార్గంతోపాటు గోదావరి నదిపై మరో రైల్వే వంతెన నిర్మిస్తారు. ఏపీలోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల అధిక ప్రయోజనం దక్కనుంది. అసన్ సోల్ నుంచి వరంగల్ వరకు గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలమీదుగా ఈ కొత్త మార్గం ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7382 కోట్లు కాగా, దక్షిణ భారతదేశంలోని థర్మల్ విద్యుత్తు స్టేషన్లకు బొగ్గును సరఫరా చేయడంతోపాటు తెలంగాణ, చత్తీస్ గఢ్, జార్కండ్, ఒడిసా రాష్ట్రాల్లోని బొగ్గు గనులకు రైలు సరఫరాను మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం.

చత్తీస్‌గడ్ నుంచి రాకపోకలు ఎక్కువవుతాయి
ఈ ప్రాజెక్టు పూర్తయితే వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, వారికి ఆర్థికంగా కొత్త కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని, దాదాపు ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా అనేక సొరంగ మార్గాలను నిర్మిస్తామని, హైదరాబాద్, అమరావతి, విజయవాడ లాంటి నగరాలకు చత్తీస్ గడ్ వాసులు సులభంగా చేరుకుంటారన్నారు. దీనివల్ల ప్రయాణ సమయం బాగా తగ్గుతుందని, ఈ మార్గం అందుబాటులోకి వస్తే విజయవాడ-హైదరాబాద్ మధ్య అనుసంధానత ఎక్కువగా ఉంటుందని మంత్రి అశ్వనీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications