హైదరాబాద్ విమానంలో మానవ బాంబు- ఎమర్జెన్సీ ల్యాండ్
కువైట్ నుండి హైదరాబాద్ వెళ్ళాల్సిన ఇండిగో విమానంలో తీవ్ర కలకలం చెలరేగింది. మానవ బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో ఈ విమానాన్ని హుటాహుటిన ముంబైకి మళ్లించాల్సి వచ్చింది. ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఘటన విమాన ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది.
ఈ వేకువ జామున 1:20 నిమిషాలకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానం అది. ఈ ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఈ బెదిరింపు ఇమెయిల్ అందింది. విమానంలో మానవబాంబు ఉందని, దీన్ని పేల్చివేస్తామంటూ ఢిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా హెచ్చరికలు అందాయి.

దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని హైదరాబాద్ కు బదులుగా ముంబైకి దారి మళ్లించారు. ఫ్లైట్ ఇంకా ముంబైకి చేరుకోలేదు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక భద్రతా బృందాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్ ను మోహరింపజేశారు.అధికారులు మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, దీనిపై ఇండిగో విమానయాన సంస్థ ఏం చెబుతోందనేది ఇంకా వెల్లడి కాలేదు.
ఇప్పటికే దేశంలోని విమానాశ్రయాల పరిసరాల్లో జీపీఎస్ స్పూఫింగ్ (GPS Spoofing) సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు కోల్‌కతా, అమృత్‌సర్, ముంబై, శంషాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన విమానాశ్రయాలలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ మానవబాంబు బెదిరింపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications