మరో గర్భిణీకి గర్భశోకం.. కడుపులోనే శిశువు మృతి; కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం
కొత్తగూడెం ప్రభుత్వ మాతాశిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తల్లి గర్భంలోనే శిశువు మృతి చెందింది. ఓ గర్భిణి మహిళ డెలివరీ కోసం వచ్చిన క్రమంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు ప్రాణాలు పోయిన ఘటన చోటు చేసుకుంది.

గర్భిణీ పై ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం .. కడుపులోనే బిడ్డ మృతి
నిన్న ఉదయం ఏడు గంటలకు నొప్పులతో వచ్చిన వరలక్ష్మి అనే గర్భిణీకి మధ్యాహ్నం 12 గంటల వరకు నార్మల్ డెలివరీ చేస్తామని కాలయాపన చేసి, ఇక రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో, కడుపులో శిశువు మరణించిందని గుర్తించి హుటాహుటిన బాధితురాలిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. తల్లి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడటంతో బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యుల నిర్లక్ష్యం వైఖరి కారణంగా కడుపులో శిశువు మరణించిందని బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వైద్యులు లేరు.. నర్సులే కాన్పులు చేస్తున్నారంటున్న బాధితులు
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే, తల్లీ బిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండే వారని బాధిత కుటుంబం చెబుతోంది. నొప్పులతో బాధపడుతూ గర్భిణీ మహిళలు ఆసుపత్రికి వచ్చిన వైద్యులు పట్టించుకోవడంలేదని, సమయానికి వైద్యులు లేకపోవడంతో అక్కడ ఉన్న నర్సులే కాన్పులు చేస్తున్న పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. అరకొరగా ఉన్న వైద్య సేవలతో పాటు, సమయానికి వైద్యులు కూడా ఉండటం లేదని వారు చెబుతున్నారు.

నెలకు పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలు గాలిలో .. అయినా స్పందించని వైద్యారోగ్య శాఖ
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేసి మరణించిన శిశువుని బయటకు తీసి తల్లిని కాపాడారు వైద్యులు. కొత్తగూడెం మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు పదుల సంఖ్యలో పిల్లలను కోల్పోతున్నా వైద్యులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన చోట కూడా సిజేరియన్ చేయకుండా, నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించి గర్భిణీ మహిళలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రి హరీష్ రావు ఇకనైనా ఈ ఘటనలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి
ఆసుపత్రికి పురుడు కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలను ఆసుపత్రి వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక తాజాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించిన శిశువు మృతదేహంతో ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు ఆసుపత్రులలో వైద్యుల నిర్లక్షానికి అద్దం పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఆస్పత్రులలో సిబ్బంది పనితీరుపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications