శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య: కారణం అదేనా?
హైదరాబాద్: తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదవడం ఇష్టం లేక ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధి పీర్జాదిగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష అనే విద్యార్థిని కళాశాల ఆవరణలో ఉన్న వసతి గృహంలో ఉంటోంది.
గురువారం మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో తన గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కళాశాల నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వెంటనే కళాశాల సిబ్బంది విద్యార్థిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మృతురాలు నాగర్‌కర్నూల్ జిల్లా వీపనగండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టంలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతిపై ఆమె కుటుంబ సభ్యులకు కళాశాల నిర్వాహకులు, పోలీసులు సమాచారం ఇచ్చారు.
అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై మరింత సమాచారం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను కోరారు.












Click it and Unblock the Notifications