హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం.. ముఖ్య అతిథిగా చిట్టి!
Hyderabad: నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో.. ప్రముఖ నటనా శిక్షణ సంస్థ "నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా" హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ప్రముఖ నటుడు అనీష్ కురువిల్ల, డైరెక్టర్లు వినయ్ వర్మ, వెంకట్ గౌడ, రచయిత ఆకెళ్ళ శివ ప్రసాద్ హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో కోల్ కతా, భోపాల్, కేరళ ప్రాంతాల నుంచే కాకుండా నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొంటున్నాయి. రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరగనుండగా.. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికను అందించేందుకు నిర్వాహకులు సంసిద్ధమయ్యారు.

కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ప్రదర్శితం కానున్నాయి. నాటక ప్రదర్శన కళలను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా ఈ ఈవెంట్ ను మరింత విజయవంతం చేసేందుకు తనవంతు కృషి చేస్తోంది.'స్వీయ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, కళలపై పట్టు సాధించడానికి నాటక రంగం ఓ శక్తివంతమైన సాధనం. విభిన్న సంస్కృతుల నుంచి యువ కళాకారులను ఓ చోట చేర్చడం ద్వారా కొత్తతరం నాటక ప్రేమికులను ప్రోత్సహించాలని భావిస్తున్నాం.' అని నిర్వాహక బృందం ప్రతినిధి దేవికాదాస్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రంగస్థలంపై చిన్నారులు చేసే మ్యాజికల్ పర్ఫామెన్స్ వీక్షించడానికి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఈ ఈవెంట్ అందిస్తోంది. కళ్లు చెదిరే నాటక ప్రదర్శనలు, అలరించే కార్యక్రమాల సమ్మేళనంతో మొదటి అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం.. ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమంగా నిలువబోతోంది. నేటితరానికి రంగస్థల ఆవశ్యకతను గుర్తుచేసేందుకు ఈ ప్రోగ్రామ్ అన్నివిధాల అనువైన సారథిగా నిలుస్తుందని తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
m












Click it and Unblock the Notifications