నయీంతో సంబంధాలు: కృష్ణయ్య భవిష్యత్తు ఏంటీ?, 'కేసీఆర్ పాదాభివందనం'
హైదరాబాద్: తెలంగాణ పోలీసుల చేతుల్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం దందాలతో తనకెలాంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఓ తెలుగు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ బీసీల కోసం పోరాడుతున్న తన గొంతు నొక్కడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
నయీం దర్యాప్తు కేసులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. తాను ఎవరికీ భయపడనని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు. విద్యార్ధి నాయకుడిగా ఉన్నప్పుడు నయీం ఉద్యమాల్లో పాల్గొనేవాడని, తన ప్రసంగాలకు ప్రేరేపితుడయ్యాడని పేర్కొన్నారు.
ఆ తర్వాత నయీం రాడికల్ సంస్ధలో చేరి గ్యాంగ్ స్టర్‌గా మారాడని చెప్పారు. నయీం దందాల్లో గానీ, నయీం నుంచి గానీ ఒక్కపైసా కూడా ఆర్ధిక లాభం పొందలేదని పేర్కొన్నారు. అయితే నయీం బాధితుల్లో ఎవరైనా తన వద్దకు వచ్చినప్పుడు మాత్రం నయీంకు ఫోన్ చేసి బెదిరించేవాడినని చెప్పుకొచ్చారు.
డబ్బు సంపాదించాలంటే ఉద్యమం కాకుండా, వ్యాపారాలు చేసేవాడినని చెప్పారు. ప్రభుత్వాలు, పోలీసులు నయీంను ఆయుధంగా వాడుకున్నాయిని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు గానీ, గ్యాంగ్ స్టర్ అనుకుంటే అవడని పేర్కొన్నారు. నయీంది, తనది గురు శిష్యుల సంబంధమని తెలిపారు.
ఫోన్ చేస్తే మాట్లాడటమే తప్ప, నయీంను వాడుకున్నది లేదని తేల్చి చెప్పారు. 15 ఏళ్లుగా నయీం హత్యలు చేసి తలకాయలు వేలాడదీస్తుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేశాయని ఆయన నిలదీశారు. ప్రజలపై అరాచకాలు చేసి ఇబ్బందులు పాలు చేస్తుంటే ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన తపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ప్రజలను ఇబ్బందులు పాలు చేసి, ఫోన్ లో మాట్లాడినంత మాత్రన నాపై ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా? అనే ప్రశ్నకు గాను టీడీపీలో ఉన్నానని చెప్పారు. తనకంటూ ఓ ఏజెండా ఉందని, దాని కోసమే తాను పనిచేస్తన్నట్లు చెప్పుకొచ్చారు.
పార్టీని వదిలేశానని తానెప్పుడు ప్రకటించలేదని, మీడియా అనవసరంగా రాద్దాంతం చేస్తుందని అన్నారు. ప్రజా నాయకుడి అని, నిజాయితీ పరుడిని అని అన్నారు. నయీం విద్యార్ధిగా ఉన్నప్పుడు తన దగ్గరే అడుక్కుపోయేవాడని చెప్పారు. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురు శిష్యుల లాంటి సంబంధం మాత్రమేనని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారే గురువుకు పాదాభివందనం చేశారని, నయీం తనని గురువుగా భావించడంలో తప్పులేదని పేర్కొన్నారు. ప్రజలు మాట్లాడుతున్న తీరు, ప్రజల విషాదం, పేపర్లో వచ్చిన వార్తలను బట్టి నయీం కేసులో ప్రభుత్వమే మొదటి ముద్దాయి అని అన్నారు.
తన శిష్యులను ఎంతోమందిని పొట్టన బెట్టుకున్నాడు కాబట్టే నయీం ఎన్ కౌంటర్‌పై సంతోష పడ్డానని అన్నారు. నయీం నుంచి తానెలాంటి ఆర్ధిక లబ్ధిని పొందలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్‌కు నేనేంటో తెలియదా? అని ప్రశ్నించారు. తనకి అక్రమ సంపాదన అవసరం లేదన్నారు.
తాను డబ్బు సంపాదించాలనుకంటే వ్యాపారాలు లేదా పైరవీలు చేసేవాడినని చెప్పుకొచ్చారు. అయితే అలా తాను చేయలేదని అన్నారు. ఇక కృష్ణయ్య భవిష్యత్తు ఏంటీ? అన్న ప్రశ్నకు గాను బీసీల హక్కుల కోసం పోరాడటమే తన ప్రధాన టార్గెట్ అని అన్నారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు.
చివరగా కాపులను బీసీల్లో చేర్చడంపై ఆయన మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలనేది రాజకీయ నిర్ణయం కాదని, అది సాంకేతిక నిర్ణయమని దానిని బీసీ కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు. అర్హత ఉన్న కులాలనే బీసీ కమిషన్ బీసీల్లో చేరుస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications