సికింద్రాబాద్ నుంచి అంబేద్కర్ యాత్రా స్పెషల్- హాల్ట్ స్టేషన్లు ఇవే
Secunderabad- Ambedkar Yatra special train: సికింద్రాబాద్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యాత్ర విత్ పంచ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్ర దర్శనం పేరిట ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మహారాష్ట్రలో వెలిసిన ప్రఖ్యాత జ్యోతిర్లింగాలను ఈ ప్యాకేజీలో చేర్చింది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/ తొమ్మిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. జులై 5వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మించిన మహవ్, దీక్షను స్వీకరించిన నాగ్‌పూర్‌ను ఈ ప్యాకేజీ ద్వారా సందర్శించవచ్చు. నాగ్‌పూర్- ఉజ్జయిని- మహవ్- నాసిక్, పుణే- ఔరంగాబాద్.. ఈ ప్యాకేజీలో ఉన్నాయి.
నాగ్‌పూర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షా భూమి, అక్కడి శ్రీ స్వామినారాయణ్ మందిర్‌లను ఈ ప్యాకేజీ ద్వారా సందర్శించవచ్చు. ఉజ్జయిని- మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడి జ్యోతిర్లింగాలు, మహవ్‌లో అంబేద్కర్ జన్మించిన ప్రదేశాన్ని దర్శించుకోవచ్చు. నాసిక్‌లో త్రయంబకేశ్వరుడి ఆలయం, పుణేలో భీమశంకర్, ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం ఇందులో ఉంది.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,700 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,700 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 22,900, పిల్లలకు 21,700 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 29,900, పిల్లలకు 28,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications