'ఓటుకు నోటుపై విచారణ ఆపేశారా?': సండ్ర ఎక్కడ?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం కేసులో విచారణ జరుగుతోందా లేక ఆపేశారా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోమవారం ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో ఏసీబీ ఎందుకు నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ పైన సర్కారు ఇప్పటి వరకు స్పందించక పోవడం విడ్డూరమన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం, ఇతర ముఖ్యుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జీవన్ రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాగా, మెడికల్ బీ కేటగిరీ సీట్లు యాజమాన్యానికి అప్పగించి అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే సంపత్ మండిపడ్డారు.

సండ్ర ఎక్కడున్నారు?
ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆచూకీ అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉన్నానని, పదిరోజుల తర్వాత విచారణకు హాజరవుతానని ఇటీవల సండ్ర ఏసీబీకి లేఖ రాశారు.
అయితే, అతను రోజుకో నగరం మారుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సండ్ర శనివారం నాడు రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం దాకా అక్కడున్న సండ్ర ఆ తర్వాత అక్కడి నుండి కూడా వెళ్లిపోయారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications