'గులాబీ గూటికి జానారెడ్డి తనయుడు..!!' : కాంగ్రెస్ కి దిగ్విజయ్ సర్జరీ మొదలైనట్టేనా..!
హైదరాబాద్ : తెలంగాణలో హస్తం పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. ఎప్పుడు ఏ నేత పార్టీ నుంచి జంప్ అవుతారో తెలియని పరిస్థితిలో పార్టీ నేతలంతా తలలు పట్టుకున్నారు. పార్టీకి సర్జరీ చేయాలని ఒకరు, పోస్ట్ మార్టమ్ చేయాలని ఇంకొకరు చెబుతుండగానే.. పార్టీ నేతలంతా వరుసపెట్టి అధికార పార్టీ తీర్థం పుచ్చేసుకుంటున్నారు.
నల్గొండ జిల్లా నేతల షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకోకముందే.. పార్టీని ముందుండి నడిపించాల్సిన జానారెడ్డి లాంటి నేతలు సైతం పదవులకు రాజీనామా చేస్తా అంటూ ప్రకటించడం, అంత వైరాగ్యమా..! అన్న వాదనలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల జలక్ లను కొనసాగిస్తూ.. జానారెడ్డి తనయుడు రఘు సైతం కారెక్కేస్తున్నారన్న ఊహగానాలు తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. జానారెడ్డి తనయుడిని కూడా టీఆర్ఎస్, పార్టీలోకి ఆహ్వానించగా ఆయన కూడా త్వరలోనే గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా.. జానారెడ్డి రాజీనామా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ను బుజ్జగించే పనిలో పడినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ కి దిగ్విజయ్ సర్జరీ మొదలైనట్టేనా..!
ఇకపోతే పార్టీ వరుస ఫిరాయింపుల నేపథ్యంలో అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్, ఆగ మేఘాల మీద రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపింది. బుధవారం హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ లో తాజా పరిస్థితులపై టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్, సీఎల్సీ నేత జానారెడ్డి సహా తదితర నేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు.
దీంతో గతంలో దిగ్విజయ్ చేసిన సర్జరీ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. పార్టీకి ఇక సర్జరీ మొదలైనట్టేనా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం తమ వ్యాపారాలు, స్వార్థ రాజకీయాల కోసమే నేతలు కాంగ్రెస్ ని వీడుతున్నారని ఆరోపించారు. అయితే, పార్టీ నుంచి ఎంతమంది బయటకు వెళ్లినా పార్టీకి వచ్చే నష్టమేమి లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications