వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక వ్యూహంతో బలోపేతం.. తిరగబడిన మరో స్ట్రాటజీ.. ఇదీ టీటీడీపీ భవితవ్యం?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వ్యాపారాల్లో ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. ఇది రాజకీయాలకూ వర్తిస్తుంది. అపర చాణక్యులుగా.. సీఈఓలుగా భుజకీర్తులు అందుకున్న నేత ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తొమ్మిదిన్నరేళ్లు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా, 2004 - 14 మధ్య కాలంలో విపక్ష నేతగా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల నాయకులతో పోలిస్తే క్రియాశీలంగా ఉన్న వారిలో చంద్రబాబు ముందు ఉంటారు.

కానీ ఆయన వ్యూహాలు అన్నిసందర్భాల్లో రాజకీయంగా లబ్ది చేకూర్చలేదు. ప్రత్యేకించి 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు 'విభజన చట్టం' ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తూనే.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకు పథకాలు రూపొందించారు. భాగ్యనగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎనిమిదో సెక్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ వ్యూహం ముందు బాబు కకావికలం ఇలా

సీఎం కేసీఆర్ వ్యూహం ముందు బాబు కకావికలం ఇలా

ఏడాది తర్వాత ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల ద్వారా టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ‘కుట్ర' పన్నారు. కానీ అతడికంటే ఘనుడు అచంట మల్లన్న అని చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడలు తెలుసు కనుకే టీడీపీ కార్యకలాపాలపై అధికారికంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిఘా పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా విజయవంతంగా ‘కుట్రపూరిత' విధానాలు అమలు చేయొచ్చని కలలు కని దొరికి పోయారు. ఇదే రాజకీయంగా తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ అభాసు పాలు కావడానికి.. చివరకు కనుమరుగయ్యే దిశగా ప్రయాణిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తీకరించేందుకు కారణమైందంటే అతిశయోక్తి కాదు. ఇది కొత్తగా ఏర్పాటైన తెలంగాణను అభాసు పాల్జేయడానికేనని అధికార టీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఊరూవాడా ‘ఢంకా' భజాయించి చెప్పారు. ఇది తెలంగాణలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అవును మరి రాజకీయాల్లో ఆత్మహత్యలే గానీ హత్యలు ఉండవు అనే సామెత టీడీపీ విషయంలో ఖచ్చితంగా వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Recommended Video

Trending News : Top 20 Latest News Updates | Oneindia Telugu
 1995లో చంద్రబాబు ‘వైస్రాయ్' వ్యూహం ఇలా అమలు

1995లో చంద్రబాబు ‘వైస్రాయ్' వ్యూహం ఇలా అమలు

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మూడోసారి 1994లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు.. తెలుగు వారికందరికీ ‘అన్నగారు' ఎన్టీఆర్.. తన అల్లుడిగా చంద్రబాబుకు పెద్దపీట వేశారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలు అప్పగించారు. 1978 నుంచి రాజకీయ వ్యూహాల అమలులోనూ, అసమ్మతి నేతలు, భవిష్యత్ పట్ల ఆశలు గలవారిని చేరదీయడంలో అందె వేసిన చేయి చంద్రబాబుది. దీనికి తోడు ఎన్టీఆర్ భోళాతనాన్ని.. ముక్కుసూటి తనాన్ని భరించేందుకు కొన్ని వర్గాలు సిద్దంగా లేవని విమర్శలు ఉన్నాయి. దీన్నుంచి బయట పడేందుకు ఆయన భార్య ‘లక్ష్మీ పార్వతి' రాజ్యాంగేతర శక్తిగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదన్న వదంతులు నమ్మిన మీడియా సంస్థల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు. దీనికి పరాకాష్టగా 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్‌లో క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. చంద్రబాబుకు దన్నుగా ఉన్న ప్రముఖ టీవీ చానెల్.. ఎప్పటికప్పుడు ‘హైప్' కల్పించి.. టీడీపీలో ఏదో జరుగుతున్నదన్న వాతావరణం స్రుష్టించారు. 100 మందికి పైగా ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోగలిగారు. గమ్మత్తేమిటంటే నాటి వైశ్రాయి హోటల్ వ్యూహం అమలులో ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకరు. చివరకు ఎన్టీఆర్‌ను ఏకాకిని చేసి సీఎంగా, టీడీపీని సొంతం చేసుకున్నారన్న సంగతి తెలుగునాట ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.

 తెర ముందు రేవంత్ రెడ్డి... తెర వెనుక టీడీపీ చీఫ్ చంద్రబాబు

తెర ముందు రేవంత్ రెడ్డి... తెర వెనుక టీడీపీ చీఫ్ చంద్రబాబు

తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా పోలీసు, నిఘా విభాగాలు ఉంటాయన్న సంగతిని విస్మరించి వైస్రాయి తరహా వ్యూహం అమలుజేయబోయి.. నిఘా ప్లస్ ఏసీబీ ముందు బహిరంగంగా పట్టుబడ్డారు. కాకపోతే చంద్రబాబు తరఫున లావాదేవీలు జరిపిన రేవంత్ రెడ్డి తెర ముందు దొరికి పోతే.. ఎప్పటికప్పుడు పరిణామాలను పర్యవేక్షిస్తున్న చంద్రబాబు కూడా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‪తో ‘ఫోన్'లో మాట్లాడుతూ ‘మనవాళ్లు భ్రీప్డ్ మీ' అని అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని దొరికిపోయారు. వైస్రాయ్ హోటల్‍లో అమలు చేసిన వ్యూహం మాదిరిగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను దెబ్బ తీయలేనా? అని అతి విశ్వాసంతో ముందుకెళ్లి దెబ్బ తిన్నారు. ఈ విషయాలన్నీ 2015 మే, జూన్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు టీవీ చానెళ్ల సాక్షిగా వీనుల విందుగా వీక్షించారు.

 బాబుకు ఇలా కేసీఆర్ హెచ్చరిక

బాబుకు ఇలా కేసీఆర్ హెచ్చరిక

ఇలా ‘వక్ర' మార్గంలో ముందుకెళ్లి బొక్కబోర్లా పడిన ఫలితం.. ఒకనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నినాదం ‘తెలుగువారి ఆత్మగౌరవం' తిరగబడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు చిక్కుకోవడంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబును ఉద్దేశించి.. ‘నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు బాబు' అని హెచ్చరించారు. టీడీపీ నేతలు మొహం చూపుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీని నుంచి బయట పడేందుకు కేంద్రం మధ్యవర్తిత్వంతో ఏపీ సీఎంగా చంద్రబాబు తన మకాం బెజవాడకు మార్చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. దీంతో టీడీపీ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. మూడేళ్లుగా తెలంగాణలో ప్రస్థానం దినదిన గండంగా మారింది.

 వెల్ కం వ్యూహం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా

వెల్ కం వ్యూహం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా

ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్.. అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రభుత్వాధినేతలుగా కలిసి సంప్రదించుకునే క్రమంలో స్నేహ పూర్వక సంబంధాలు పెరిగాయి. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ప్రజలు గణనీయంగానే ఉన్నారు. వారి మద్దతుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందొచ్చని సీఎం కేసీఆర్ వ్యూహం రచించారు. అటు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చునని చంద్రబాబు ఊహించారు. అదే మాట టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుతో అనిపించారని రాజకీయ విమర్శకులు అంటారు. అదే బూమరాంగ్ అయ్యింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి చేసిందన్న చందంగా తెలంగాణలో సీఎం కేసీఆర్.. తన రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. దానికి దన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో టీటీడీపీలో ముసలానికి హేతువైంది.

 పయ్యావుల - కేసీఆర్ చర్చలతో అసలు సంగతి బహిర్గతం

పయ్యావుల - కేసీఆర్ చర్చలతో అసలు సంగతి బహిర్గతం

2014 నుంచి అధికార టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలపై టీడీపీ నాయకుడిగా రేవంత్ రెడ్డి ధీటుగా సమరం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీపై పోరాడుతున్న రేవంత్ రెడ్డికి సహజంగానే మోత్కుపల్లి వ్యాఖ్యలు రుచించలేదు. దీనికి తోడు ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కావడం.. పయ్యావుల కేశవ్ సంప్రదింపులు.. ‘వెల్ కం' వ్యూహం బహిర్గతం కావడంతో రేవంతుడు అప్రమత్తమయ్యారు. పొత్తుల సంగతి తేల్చాలనే సరికి చంద్రబాబు ఆ మాటెత్తొద్దని హుకుం జారీ చేశారు. కానీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమే. తన రాజకీయ భవితవ్యం గురించి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సి వచ్చింది. గవర్నర్ పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడంతో అధినేత చంద్రబాబు సూచన మేరకు వచ్చే ఏడాది రాజ్యసభ సీటు కోసం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన మోత్కుపల్లి.. రేవంతుడి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావించారు.

 కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో సంప్రదింపులు?

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో సంప్రదింపులు?

కానీ పరిస్థితులు తారుమారైతే తన భవితవ్యం ప్రశ్నార్థకం అని గుర్తించిన రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. హస్తినకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిపి వచ్చారు. దీనిపై చిట్ చాట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రదిస్తే తప్పేంటి? అని సవాల్ విసిరారు. దీన్ని పదవుల కోసం చూస్తున్న టీటీడీపీ నేతలు అనువుగా మార్చుకోవడంతో రేవంత్ రెడ్డి చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీని వీడారు. మూడేళ్లుగా టీటీడీపీలో చురుకైన నాయకుడిగా వ్యవహరించిన రేవంత్ రెడ్డికి తెలంగాణ అంతటా అభిమానులుగా తెలుగు తమ్ముళ్లు విశ్వసిస్తున్నారు. దీనికి నిదర్శనం మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మొదలు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ ఇన్ చార్జిలు, సీనియర్ నేతలు టీడీపీకి రాజీనామా చేయడమే. ఇంకా కొన్ని రోజులాగితే టీటీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతున్నది.

 రేవంత్ విషయంలో ఇలా టీడీపీ వ్యూహం ఇలా ప్రతికూలం

రేవంత్ విషయంలో ఇలా టీడీపీ వ్యూహం ఇలా ప్రతికూలం

తెలంగాణ ఏర్పాటు విషయమై 2013 - 14లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లకపోవడంతో 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకు పోగా.. తెలంగాణలో రెడ్లు, బీసీలు, కమ్మలు, మాదిగల మద్దతు ప్లస్ బీజేపీతో పొత్తుతో 12 స్థానాలు గెలుచుకున్నది టీడీపీ. కానీ ఎల్లవేళలా రాజకీయాల్లో ఈ పొత్తు రాజకీయాలు పని చేయవని పరిణామాలు చెప్తున్నాయి. ఓటుకునోటు కేసుతో తెలంగాణకు వ్యక్తిగతంగా చంద్రబాబు దూరం కావడంతోపాటు పూర్తిగా ఏపీ వ్యవహారాలపైనే ద్రుష్టి పెట్టారు. మరోవైపు ఒంటిచేత్తో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డిని వదులుకోవడంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా తెర మరుగయ్యే పరిస్థితి నెలకొన్నది. అంతకుముందు తెలంగాణలో ఎప్పటికైనా పట్టు పెంచుకోగలమని భావించిన చంద్రబాబు తాజా వ్యూహాల గురించి సబ్బండ వర్ణాలకు తెలుసు. ప్రతీసారి మోసం చేయాలని భావిస్తే కష్టమేనని పరిణామాలు చెప్తున్నాయి.

 హైదరాబాద్ శివారుల్లో కమ్మ సామాజిక వర్గం ఇలా

హైదరాబాద్ శివారుల్లో కమ్మ సామాజిక వర్గం ఇలా

ఏపీలో అధికారంలో ఉన్నా తెలంగాణను వదిలిపోనని భవిష్యత్ మనదేని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటికప్పుడు ఆయన మాటలు సిల్లీగా కనిపించినా తెలంగాణలో టీడీపీకి పునాది ఉన్నది. హైదరాబాద్ నగరం చుట్టూ కమ్మ సామాజిక వర్గ ప్రజలు గణనీయ స్థాయిలో విస్తరించి ఉన్నారు. రాజకీయంగా విధాన నిర్ణయాలను గణనీయ స్థాయిలో నిర్దేశించే సామర్థ్యం వారికి ఉన్నది. తర్వాత తెలంగాణలో ‘కమ్మ' సామాజిక వర్గం ఎక్కువగా గల ఖమ్మం జిల్లా.. బీసీల్లో టీడీపీకి గల పట్టు కలిసి వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావించారు. టీఆర్ఎస్ శాశ్వతంగా అధికారంలో ఉండే అవకాశాల్లేవు. 2024 ఎన్నికల నాటికైనా.. తర్వాతైనా పుంజుకోవచ్చని టీడీపీ నాయకత్వం.. ప్రత్యేకించి చంద్రబాబు వ్యూహం. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అంతర్గత కలహాలతో ఉంటుంది కనుక పట్టు సాధించొచ్చని కల కన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా టీడీపీ కనుమరుగు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా టీడీపీ కనుమరుగు

కానీ తెలంగాణ సీఎం.. టీఆర్ఎస్ నాయకత్వం వ్యవహార శైలి.. ఇటీవలి కాలంలో చేసిన వ్యాఖ్యలు రెడ్లు ఏకీక్రుతం కావడానికి దారి తీశాయి. ఇప్పటికిప్పుడు ఇది ఎటు మలుపు తిరుగుతుందో చెప్పడం తొందరపాటే గానీ.. పరిస్థితుల్లో మార్పు వస్తున్నదన్న సంగతి మాత్రం చేదు నిజం. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 98 స్థానాలు గెలుచుకోగా, టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. ఇక నాటి నుంచి టీటీడీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. తెలంగాణలో పార్టీని సంస్కరించే పరిస్థితిలోకి టీడీపీ అధినేత చంద్రబాబు పడిపోయారు. ఒకవేళ తెలంగాణలోని టీడీపీ వ్యవహారాల్లో వేలు పెడితే ఓటుకు నోటు కేసు ముందుకెళుతుందన్న భయంతో చంద్రబాబు నాయుడు టీడీపీని పూర్తిగా గాలికి వదిలేశారని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. అసలు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వంటి వారు.. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల జోలికి వస్తే ‘ఓటుకు నోటు' కేసు కదులుతుంది జాగ్రత్త అని బహిరంగంగానే తేల్చి చెప్పారు.

 ఇలా రేవంత్‌పై తిరగబడిన బాబు వ్యూహం

ఇలా రేవంత్‌పై తిరగబడిన బాబు వ్యూహం

తెలుగు ఆత్మగౌరవం పేరుతో టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ హయాంలోనే తెలంగాణలో పార్టీకి బలమైన పునాది ఏర్పడింది. టీడీపీ స్థాపించినప్పుడు బీసీలను బలంగానే ఆకట్టుకున్నారు. రాయలసీమతోపాటు తెలంగాణలోనూ టీడీపీకి బాగా ఆకర్షితులయ్యారు. కోస్తాంధ్రలో కమ్మల మాదిరిగానే తెలంగాణలో రెడ్లు టీడీపీకి అండగా నిలిచారు. రాయలసీమలో మాత్రం రెడ్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. తెలంగాణ ఆవిర్బావం నుంచి ఎన్టీఆర్‌కు దన్నుగా నిలిచారు. ఇంద్రారెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డిలతోపాటు పలువురు రెడ్డి ఎమ్మెల్యేలు, ఆ స్థాయి నేతలు అండగా ఉన్న వారే. ఇలా కులాలకు అతీతంగా పునాది వేసుకున్న టీడీపీ.. ఆ పార్టీ అధినేత కుట్రపూరిత వ్యూహంతో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందా? అని రాజకీయ విశ్లేషకులు సందేహిస్తున్నారు.

English summary
There are rumours that Telugudesham will disappear in Telangana. AP CM and TDP president Chandra Babu vows that save Party base in Telangana with alliance with TRS 2019 elections. But Revant Reddy opposed this formula. In this context Chandrababu plan implementation reversible as politically.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X