IT కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం, వీరికి తప్పనిసరి - ఈ సారి కొత్త విధానాల్లో...!!
IT కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం అమలుకు సిద్దం అయ్యాయి. తాజాగా ప్రధాని మోదీ చేసిన సూచనల ఫలితంగా ఈ దిశగా కసరత్తు జరుగుతోంది. గతంలో అమలు చేసిన దాని కంటే భిన్నం గా ఈ సారి కొత్త విధానాలతో వర్క్ ఫ్రం హోం అమలు చేయనున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, ఉద్యోగుల రాకపోకలను నియంత్రించడం లక్ష్యంగా ఐటీ కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నట్లు నాస్కామ్ ప్రకటించింది. ఇక ఐటీ సంస్థలు ఉద్యోగుల కేటగిరీల వారీగా వర్క్ ఫ్రం హోం అమలు పైన ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్దం అవుతున్నాయి.
ప్రధాని తాజాగా ఉద్యోగుల విషయంలో చేసిన సూచనలు అమలు దిశగా కసరత్తు జరుగుతోంది.
చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు 'వర్క్ ఫ్రం హోం'ను ఎంచుకోవాలని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో ఐటీ రంగంలో ఆ మేరకు కదలిక మొదలైంది. నాస్కామ్ వెంటనే స్పందించింది. వర్క్ ఫ్రం హోమ్ అమలు లో భాగంగా హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాలను విస్త్రృతం చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీలు ఇప్పటికే క్యాంప్‌సలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాయని పేర్కొంది. అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా కొన్ని సౌకర్యాలను పరిమితం చేశామని తెలిపింది. రిమోట్ లేదా హైబ్రిడ్ విధానాలతో ఉద్యోగుల రోజువారీ ప్రయాణాలను తగ్గించి, తద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తామని ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నై, గురుగ్రామ్ లాంటి ఐటీ హబ్‌లలో లక్షల మంది ఉద్యోగులు రోజూ వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తుండటంతో భారీ స్థాయిలో పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతోంది.

దశల వారీగా అమలుకు నిర్ణయం
2020లో కొవిడ్ సమస్య వచ్చినపుడు మొత్తం ఐటీ రంగం వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారింది. తర్వాత మూడేళ్లపాటు హైబ్రిడ్ విధానమే కొనసాగింది. గత ఏడాది నుంచే కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని ఒత్తిడి చేస్తున్నాయి. తాజాగా గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో రవాణా వ్యయాలు పెరుగుతున్న తరుణంలో కంపెనీలు మరోమారు వర్క్ ఫ్రం హోం వైపు మొగ్గు చూపుతున్నాయి. భారీ క్యాంప్‌సలు నిర్వహించే కంపెనీలు విద్యుత్, డీజిల్ జనరేటర్ వినియోగం, ఉద్యోగుల ట్రాన్ప్‌పోర్టు ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం దిశగా కంపెనీలు కదలడం ఖాయంగా కనిపిస్తోంది. అవకాశం ఉన్న ప్రతీ చోట వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘమైన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రం అధికారిక సలహా జారీ చేయాలని ఉద్యోగ సంఘం కోరింది.













Click it and Unblock the Notifications