కేసీఆర్ ను జీవసమాధి చేసే యత్నం, కవిత చర్యలతో ఆ పార్టీకే లాభం!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కవిత లేఖ సృష్టించిన సంచలనంపై అన్ని పార్టీలలోనూ చర్చ జరుగుతుంది. కవిత కొత్త పార్టీ పెడతారు అన్న ప్రచారం జరుగుతున్న వేళ కవిత వ్యవహారంపై ఆసక్తికర స్పందనలు బయటకు వస్తున్నాయి.
కవిత వ్యవహారంపై జగ్గారెడ్డి సంచలనం
తాజాగా కవిత లేఖపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కవిత లేఖతో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కవిత డిప్రెషన్ లో ఉండి లేఖలు విడుదల చేస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీని చంపటం, బతికించుకోవడం వాళ్ళ వ్యక్తిగతమని, కవిత లేఖతో, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అయ్యిందని క్లియర్ గా అర్థమవుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ ను జీవ సమాధి చేసే ప్రయత్నం
కవిత చర్యలు బిజెపి ప్రాధాన్యతను పెంచుతున్నాయని, కవిత కారణంగా ఆ పార్టీ లీడర్లు బిజెపి కి వెళ్లే అవకాశం ఉందని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గత అంశాలు ఉంటాయని పేర్కొన్న జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోను కవిత లేఖ కలకలం రేపింది అన్నారు. కెసిఆర్ దేవుడు అంటూనే ఆయనను జీవ సమాధి చేయడానికి ప్రయత్నం జరుగుతోందని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
కవిత ప్రభావం ఏమీ ఉండదు
తెలంగాణ రాష్ట్ర విభజన కోణంలోనే నాడు కెసిఆర్ కు ప్రజలు పట్టం కట్టారని కానీ ప్రస్తుతం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఏం చేసినా కవిత రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపించబోదని, కెసిఆర్ కూతురు కాబట్టే మీడియాకి ఇంతటి ఆసక్తి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కు నష్టం , బీజేపీకి లాభం
ఇక ఇప్పటి వరకు ఏ చరిత్ర చూసుకున్నా కొడుకే వారసుడని స్పష్టంగా కనబడుతుంది అన్నారు. కవిత లేఖతో బిఆర్ఎస్ కార్యకర్తలను గందరగోళానికి గురిచేసి బిజెపికి బలం పెంచుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. కవిత చర్యలు బీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని బిజెపికి లాభాన్ని తెచ్చి పెడుతున్నట్టుగా కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications