సంగారెడ్డిలో మళ్లీ పోటీపై జగ్గారెడ్డి శపథం..! కీలక నిర్ణయం..!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో పలుమార్లు ఇక్కడి నుంచే గెలిచిన ఆయన.. గత ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓడిపోయారు. అదీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సమయంలో సంగారెడ్డిలో ఓటమి ఆయన్ను తీవ్రంగా కుంగదీస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇవాళ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం సహా పలు ఛాన్స్ లు మిస్ చేసుకున్న జగ్గారెడ్డి.. మరోసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన శపథం కూడా చేశారు. గత ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి తనకు ఓటేయాలని ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు మాత్రం ఓడించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తాను వచ్చేసారి ఇక్కడ పోటీ చేయబోనన్నారు.

సంగారెడ్డిలోని గంజి మైదానంలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో తన భార్య నిర్మలతో కలిసి పాల్గొన్న జగ్గారెడ్డి స్థానిక ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి సంగారెడ్డిలో పేద ప్రజలు కారణం కాదని, మేథావులు, పెద్దలేనని తెలిపారు. రాహుల్ గాంధీ తన భుజంపై చేయి వేసి మరీ గెలిపించాలని కోరినా ఇక్కడి ప్రజలు తనకు ఓటేయలేదని జగ్గారెడ్డి గుర్తుచేసుకున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల పోటీ చేసినా ఆమెకు కూడా ప్రచారం చేయబోనని, ఇతర నియోజకవర్గాల్లో అయితే ప్రచారం చేస్తానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications