‘జయ జయహే తెలంగాణ’ ఇక పాఠ్యపుస్తకాల్లో!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే పాఠశాల పాఠ్య పుస్తకాల్లో ఈసారి రాష్ట్ర గేయాన్ని చేర్చాలని నిర్ణయించింది. వచ్చే విద్య సంవత్సరాని(2025-26) ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ కవి అందెశ్రీ రచించిన 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర గేయాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి చెప్పారు.

ప్రస్తుతం పుస్తకాల్లో జనగణమన, వందేమాతరం, ప్రతిజ్ఞ లతోపాటు జయజయహే తెలంగాణ గేయాన్ని కూడా ముద్రించనున్నారు. తెలుగు, సాంఘిక శాస్త్రం లాంటి కొన్ని సబ్జెక్టుల పుస్తకాల్లో తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ముద్రించనున్నారు. దీనిపైనా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, ఈసారి మాత్రం పాత సిలబస్‌నే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగేళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలుగు-ఇంగ్లీష్, హిందీ-ఇంగ్లీష్, ఉర్దూ-ఇంగ్లీష్ ఇలా రెండేసి భాషల్లో పుస్తకాలను ముద్రిస్తున్నారు. పిల్లలకు పుస్తకాల బరువు పెరుగుతోందని భావించి.. భాషేతర పుస్తకాలను భాగాలుగా చేసి విద్యార్థులకు అందిస్తున్నారు.
అయితే, పాత సిలబస్‌తోనే వచ్చే విద్య సంవత్సరం కూడా పుస్తకాలను ద్విభాషల్లోనే ముద్రించనున్నారు. 2026-27 విద్య సంవత్సరం మాత్రం సిలబస్ మారుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈసారి పుస్తకాల్లో ఎలాంటి తప్పులు లేకుండా సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకోనున్నట్లు తెలిపారు. పిల్లలకు పుస్తకాలు ఎక్కువ బరువు కాకూడదనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications