దసరాలోగా కీలక నిర్ణయం: కేసీఆర్‌తో భేటీపై కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఇటీవల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాలపై ఈ సందర్భంగా ప్రధానంగా చర్చ జరిగింది. బీజేపీకి వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నంలో భాగంగానే కుమారస్వామిని ఆహ్వానించి చర్చలు జరిపారు.

దసరాలోగా కీలక నిర్ణయం: కేసీఆర్‌తో భేటీపై కుమారస్వామి
అయితే, తాజాగా, కేసీఆర్‌తో భేటీపై కుమారస్వామి తాజాగా స్పందించారు. కేసీఆర్‌తో తాను జరిపిన చర్చలు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కాదని స్పష్టం చేశారు కుమారస్వామి. అయితే, వచ్చే దసరాలోగా ఓ కీలక నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు.

ఆ విషయం కేసీఆర్ కు మాత్రమే తెలుసంటూ కుమారస్వామి
దేశంలోని రైతులు, మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా తమ మధ్య చర్చలు జరిగాయని అన్నారు. ఆయా అంశాలను ఎలా అమలు చేయాలో కేసీఆర్‌కు మాత్రమే తెలుసని కుమారస్వామి చెప్పారు. దేశంలోని చిన్న పార్టీగా తామూ తెలంగాణ సీఎంకు సహకరిస్తామని అన్నారు. సమస్యలపై పరిష్కారం దిశగా ఎవరు గొంతు విప్పినా తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం అవసరమని తెలిపారు.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించా: కుమారస్వామి
జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు నిర్దిష్టమైన లక్ష్యాలతో పని చేయాల్సి ఉందని కుమారస్వామి వెల్లడించారు. జాతీయ రాజకీయాలతోపాటు పలు అంశాలపైనే కేసీఆర్‌తో చర్చించానని తెలిపారు. కాగా, జాతీయ రాజకీయాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

కేంద్రంలో మనలాంటి ప్రభుత్వం అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు
కాగా, ఇటీవల కేసీఆర్ ఎక్కడ బహిరంగ సభ పెట్టినా కేంద్రంపై విమర్శలు గుప్పించడంతోపాటు తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు స్పష్టం చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు అండగా నిలబడాలని తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అవసరమైతే జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, కుమారస్వామి దసరా వరకు కీలక నిర్ణయం ఉంటుందని చెప్పడంతో కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications