ఘాతుకం: కలెక్టరేట్ ఎదురుగా యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
కరీంనగర్ : కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతి గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటన కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో జరిగింది.
కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ అనే యువతి పనిచేస్తోంది. రోజులానే శుక్రవారం విధులకు హాజరైంది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వంశీధర్ అనే ఓ యువకుడు వచ్చి తనతో మాట్లాడాలని కోరడంతో రసజ్ఞ బయటకు వెళ్లింది. వారిద్దరి మద్య వాగ్వాదం జరిగనట్లు తెలుస్తోంది. దీంతో వంశీధర్ తనవెంట తెచ్చుకున్న కత్తితో రసజ్ఞ గొంతు కోశాడు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను మీసేవా సిబ్బంది వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే మార్గమధ్యలోనే రసజ్ఞ మృతిచెందింది. గొంతుకోసి పారిపోతున్న వంశీధర్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాటారం మండలంకు చెందిన వంశీధర్ రసజ్ఞల మధ్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది.
రసజ్ఞ ఆధార్ కార్డు వివరాల ఆధారంగా ఆమె రామగుండంలోని హనుమాన్ నగర్‌కు చెందినదిగా గుర్తించారు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో కరీంనగర్ ఉలిక్కిపడింది.












Click it and Unblock the Notifications