తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు, 2 కంపెనీలతో డీల్
తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (Telangana Overseas Manpower Company Ltd)-(TOMCOM) , జపాన్‌కు చెందిన టెర్న్ గ్రూప్ (TERN Group - TGUK Technologies Private Limited), రాజ్ గ్రూప్ (Raj Group)లతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

జపాన్‌లో ఉద్యోగాలు ఇలా
ఈ ఒప్పందాల ద్వారా, రాబోయే 1-2 సంవత్సరాల్లో జపాన్‌లోని వివిధ రంగాల్లో 500 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఆరోగ్య సంరక్షణ రంగంలో 200, ఇంజనీరింగ్ (ఆటోమోటివ్, మెకానికల్, ఐటీ) రంగంలో 100, ఆతిథ్య రంగంలో 100, నిర్మాణ రంగం (సివిల్, భవన నిర్మాణం, పరికరాల నిర్వహణ)లో 100 ఉద్యోగాలు ఉన్నాయి.
టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే TERN గ్రూప్, జపాన్‌లో సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, Specified Skilled Worker (SSW) నియామకాల్లో ప్రసిద్ధి చెందిన సంస్థ. అలాగే, రాజ్ గ్రూప్, జపాన్‌లోని ప్రముఖ నర్సింగ్ కేర్ సంస్థ సుకూయి కార్పొరేషన్‌తో కలిసి, సంరక్షకుల (కేర్ టేకర్స్) శిక్షణ, నియామకాలలో TOMCOMతో ఇప్పటికే సహకరిస్తోంది. తాజా ఒప్పందంతో ఈ భాగస్వామ్యం ఆరోగ్యేతర రంగాలకు కూడా విస్తరించనుంది. ఈ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను అందించే లక్ష్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
జపాన్‌లో తెలుగు ప్రవాసులతో రేవంత్
తెలంగాణకు పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు పెరగాలి. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ప్రవాసులు ఎవరికి చేతనైనంత వారు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. జపాన్ దేశ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో 'జపాన్ తెలుగు సమాఖ్య' ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచంతోనే తెలంగాణ పోటీ
ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా చెప్పారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎంతో ఉంటుందని అన్నారు. న్యూయార్క్‌లో హడ్సన్ రివర్ ఫ్రంట్, లండన్‌లో థేమ్స్, సియోల్ నగరంలో రివర్ ఫ్రంట్లతో పాటు టోక్యో నగరంలో వాటర్ ఫ్రంట్లను పరిశీలించామని, ఇదే కోవలో హైదరాబాద్ నగర అభివృద్ధికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరం స్తంభించిపోయే పరిస్థితులను గమనిస్తున్నాం, ఇలాంటి పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవలసిన అవసం ఉందని అన్నారు.
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల వంటి ప్రాజెక్టులు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో సాధించాల్సినంత ప్రగతి సాధించామని, ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించడంలో అందరి సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధులు, టోక్యో నగరంలో స్థిరపడిన ప్రవాస తెలుగు వారు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications