తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం-బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటన-బహుజన వాదం టు కాషాయం...?
'క్యూ' న్యూస్ నిర్వాహకుడు,జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సిద్దాంతాలకు ఆకర్షితుడై మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్లు క్యూ న్యూస్‌లో వార్తలు ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న మల్లన్నను విడుదల చేయించేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారని చెబుతున్నారు. మల్లన్న ట్విట్టర్ ఖాతాలోనూ 'జై బీజేపీ' అని ట్వీట్ చేయడం గమనార్హం. జైలు నుంచి విడుదలయ్యాక మల్లన్న బీజేపీలో చేరే అవకాశం ఉంది.
ఊహించిందే జరిగిందా...
తీన్మార్ మల్లన్న బీజేపీ మనిషి అనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. అన్ని పార్టీల నేతలను,విధానాలను చీల్చి చెండాడే మల్లన్న బీజేపీ విధానాల పట్ల మాత్రం పెద్దగా విమర్శలు చేసిన దాఖలా లేదు. మల్లన్న కేసులు ఎదుర్కొన్న ప్రతీసారి అందరికన్నా బీజేపీ నేతలే ఆయనకు ఎక్కువ అండగా నిలబడుతున్నారు.మల్లన్న తరుపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. ఇక మరో ముఖ్య అంశం... మల్లన్న సామాజికవర్గం.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ఎంపీ అరవింద్‌లు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారన్న విషయం తెలిసిందే. మల్లన్నది కూడ అదే సామాజికవర్గం కావడంతో బీజేపీతో బంధం బలపడినట్లు చెబుతారు.రాష్ట్రంలో ఆ సామాజికవర్గం వారు ప్రస్తుతం బీజేపీ వెనుక ఎక్కువ సంఖ్యలో ర్యాలీ అవుతున్నారు.

కేసీఆర్ సర్కార్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకనే...
గత నెలలో హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలోని క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సైతం అక్కడికి వచ్చి మల్లన్నకు మద్దతుగా నిలిచారు. మల్లన్న వెనుక బీజేపీ ఉందనే ప్రచారానికి ఈ పరిణామంతో బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం జైల్లో ఉన్న మల్లన్న.. అక్కడినుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నేరుగా బీజేపీ పెద్దలే రంగంలోకి దిగినట్లు క్యూ న్యూస్‌లోనే వార్తలు ప్రసారం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి తన శక్తి సరిపోదని గ్రహించిన మల్లన్న బీజేపీ అయితేనే అందుకు సరైన వేదిక అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

బహుజనవాదం టు కాషాయం...
మల్లన్న మొదటి నుంచి తనది బహజన భావజాలం అని ప్రచారం చేసుకుంటున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్,పూలే వంటి బహుజన మహనీయులు తనకు ఆదర్శమని.. వారి బాటలోనే నడుస్తానని పలుమార్లు పలు వేదికలపై ప్రకటించారు.ఇప్పటికీ మల్లన్న ట్విట్టర్ ప్రొఫైల్‌లో 'బాబా సాహెబ్ అంబేడ్కర్ బాటలో...' అని రాసి ఉండటం గమనించవచ్చు. ఇన్నాళ్లు బహుజన భావజాలం పేరు చెప్పిన మల్లన్న... ఇప్పుడు బీజేపీ గూటిలో చేరేందుకు సిద్ధపడటం చర్చనీయాంశంగా మారింది.మల్లన్న దీన్ని ఎలా సమర్థించుకుంటారో... విమర్శలకు ఎలా సమాధానం చెబుతారో చూడాలి. మల్లన్న బహుజనవాది అని నమ్మి.. ఆయన రాజకీయాలకు మద్దతు పలికినవాళ్లకు ఒకరకంగా ఇది షాక్ అనే చెప్పాలి.

రంగంలోకి బీజేపీ పెద్దలు...
తీన్మార్ మల్లన్నపై దాదాపు 30కి పైగా కేసులు ఉన్నాయి.జ్యోతిష్యుడిని బ్లాక్‌మెయిల్ చేశారనే కేసులో ఇటీవల మల్లన్నకు బెయిల్ మంజూరైంది. అయితే ఆయన జైలు నుంచి బయటకొచ్చారో లేదో... మరో కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టాలని కలలు కంటున్న మల్లన్నకు... ప్రభుత్వం తనను ఎక్కడ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తుందేమోనన్న ఆందోళన వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.దీంతో బీజేపీ గూటికి చేరితేనే ఈ కేసులను,టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలననే నిర్ణయానికి మల్లన్న వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మల్లన్నను బయటకు తీసుకొచ్చేందుకు చాలానే ప్రయత్నాలు సాగుతున్నాయి. మల్లన్నను విడుదల చేయించాలని ఆయన భార్య ప్రధాని మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు మెయిల్ ద్వారా కోరినట్లు చెబుతున్నారు. మల్లన్న కూడా బీజేపీ గూటిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో బీజేపీ పెద్దలు ఆయన విడుదలకు చొరవ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
Recommended Video

మల్లన్నపై గతంలో చిలకా ప్రవీణ్ ఆరోపణలు
తీన్మార్ మల్లన్న బహుజనవాదం పేరుతో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలను మోసం చేస్తున్నాడని చిలకా ప్రవీణ్ అనే జర్నలిస్టు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌లోనే ప్రవీణ్ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. క్యూ న్యూస్‌ను అడ్డుపెట్టుకుని మల్లన్న ఇప్పటివరకూ రూ.200 కోట్లు వరకు వసూలు చేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్,కాంగ్రెస్,ఎంపీలు బండి సంజయ్,ధర్మపురి అరవింద్‌ల నుంచి డబ్బులు తీసుకొచ్చుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్కను కూడా మల్లన్న డబ్బులు డిమాండ్ చేశాడని... అయితే మల్లన్న సంగతి తెలిసి ఆమె డబ్బులు ఇవ్వలేదని అన్నారు.












Click it and Unblock the Notifications