హరీశన్నా.. కాపాడన్నా.. కష్టంగా ఉంది : కరోనా బారిన పడిన జర్నలిస్టు వేదన, మంత్రి స్పందన
హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడి అనేక మంది నరకయాతన అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, కరోనా బారినపడిన ఓ జర్నలిస్టు తనను కరోనా బారి నుంచి కాపాడాలంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు మొరపెట్టుకున్నారు.
హరీశన్నా.. కాపాడు అంటూ..
‘అన్నా.. హరీషన్నా.. కాపాడు' అంటూ ఓ సీనియర్ జర్నలిస్టు మంత్రి హరీశ్ రావును వేడుకున్నారు. డబ్బులు తామే పెట్టుకుంటాం.. అపోలో ఆస్పత్రిలో బెడ్ ఇప్పించండన్నా అని సెల్ఫీ వీడియో ద్వారా విన్నవించాడు. సీనియర్ జర్నలిస్టు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, తన పరిస్థితి బాగాలేదని, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తన కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారని చెప్పారు. అపోలో ఆస్పత్రిలో ఒక బెడ్ ఇప్పించాలని సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి హరీశ్ రావును కోరారు.

వెంటనే స్పందించిన హరీశ్ రావు..
కాగా, జర్నలిస్టు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీడియోపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రి నుంచి యశోదా ఆస్పత్రికి షిఫ్టు చేయించారు. శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య విషయంలో యశోద ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడారు. అంతేగాక, తన వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు మంత్రి హరీశ్.

హరీశన్నకు జర్నలిస్టు ధన్యవాదాలు..
ఈ నేపథ్యంలో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి మరో సెల్పీ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. హరీశన్న చొరవతో యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పారు. దీనిపై రాజకీయం చేయొద్దని శ్రీనివాస్ రెడ్డి కోరారు. కాగా, వెంటనే స్పందించిన హరీశ్ రావుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications