
తెలంగాణ రైతులకు శుభవార్త-జూన్ 15 నుంచి రైతు బంధు-వ్యవసాయ శాఖ మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు బంధు నిధుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 150.18 లక్షల ఎకరాలకు గాను రూ.7508.78 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొంది. సీసీఎల్ఏ(చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) తుది జాబితా ప్రకారం ఈ ఏడాది 63,25,695 మంది అర్హులను గుర్తించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం(జూన్ 13) ఈ వివరాలు వెల్లడించారు.

జాబితాలో కొత్తగా 66వేల పైచిలుకు రైతులు
ఈ ఏడాది కొత్తగా మరో 66,311 ఎకరాలు రైతు బంధు పథకంలో చేర్చినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. తద్వారా మరో 2.81లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనున్నట్లు చెప్పారు. మొదటిసారి రైతు బంధు అర్హుల జాబితాలో చేరినవారు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన జిరాక్సులు సమర్పించాలని తెలిపారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులు నివృత్తి చేస్తారని స్పష్టం చేశారు.

అత్యధికంగా నల్గొండలో...
రైతు బంధు పథకం కింద అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,72,983 మంది లబ్దిదారులు ఉన్నట్లు నిరంజన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 12.18 లక్షల ఎకరాలకు గాను 608.81 కోట్ల నిధులు అవసరమవుతాయన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం 2.22 లక్షల మంది రైతులను పార్ట్ బీ నుంచి పార్ట్- ఏ ఖాతాల్లోకి మార్చినట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. ఆ రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతా నంబర్,ఇతరత్రా వివరాలను పరిశీలించి రైతు బంధు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

2018లో మొదలైన పథకం...
తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా ఎకరాకు రూ.5 వేలు చొప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. మొదట ఎకరానికి రూ.4 వేలు చొప్పున రెండు పంటలకు రైతు బంధు అందించారు. ఆ తర్వాత మరో రూ.1 వెయ్యి పెంచి రూ.5వేలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం... కాళేశ్వరం సాగునీరుతో తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది.పత్తి సాగులోనూ దేశంలో నంబర్.2గా నిలిచింది.