హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య... నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్...
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ,పెళ్లి పేరుతో తనకు దగ్గరైన యువకుడు చివరకు వేరే యువతితో పెళ్లికి సిద్దమవడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... కావలి అనురాధ(22) అనే యువతి కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గత ఆరేళ్లుగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ జ్ఞానిజైల్ సింగ్ నగర్ బస్తీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.

ఇన్నాళ్లు అనురాధతో సహజీవనం చేసిన కిరణ్ ఇటీవలే మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు.ఆ విషయం తెలిసి షాక్ తిన్న అనురాధ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జ్ఞానిజైల్ సింగ్ నగర్ బస్తీలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
బంజారాహిల్స్‌లో యువతిపై అత్యాచారం :
బంజారాహిల్స్‌లోనే చోటు చేసుకున్న మరో ఘటనలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న ఓ విల్లాలో ఆ యువతి పని చేస్తోంది.రోజూ లాగే ఈ నెల 15వ తేదీన విల్లాలో పనిచేయడానికి వెళ్లింది. ఆమె ఫ్లోర్ క్లీన్ చేస్తున్న సమయంలో... అదే ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న శివ(38) అనే వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు.ఆమెను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కితే చంపేస్తానని హెచ్చరించాడు. బాధిత యువతి తన సోదరుడికి విషయం చెప్పడంతో ఇద్దరు కలిసి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు నిందితుడు శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్ :
నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. యువతికి బలవంతంగా మద్యం తాగించి.. బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రి గదిలో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు.బాధిత యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నింధితుల కోసం గాలిస్తున్నారు.