కేసీఆర్ తో కలిసి మోడీ, రేవంత్ రెడ్డిని ఢీకొట్టేది ఆయనేనట!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కేఏ పాల్ సూచించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేడు హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెడ్డి రాజ్యాన్ని పడగొడదామని, బీసీ రాజ్యాన్ని నిలబెడతామని ఆయన పిలుపునిచ్చారు.
అవసరం అయితే కేసీఆర్ తో కలిసి పని చేస్తా: కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీలో చేరితే వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని కేఏ పాల్ వెల్లడించారు. సదాశివపేట అభివృద్ధి చేసినట్టు వరంగల్ ను అభివృద్ధి చేస్తానన్నారు. అవసరమైతే కేసీఆర్ తో కలిసి పని చేస్తానని, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారిపై సిబిఐతో విచారణ చేయించి ఆ సొమ్మును ప్రజలకు పంచుతానని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని కోరిన కేఏ పాల్
గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లో ఉచిత వైద్యం, విద్య అందిస్తానని, సంవత్సరంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తానని ఆయన పేర్కొన్నారు. కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడంలేదని కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.
మోడీని, రేవంత్ రెడ్డిని ఢీకొట్టేది నేనే
ప్రస్తుతం రేవంత్ రెడ్డి వసూలు చేసిన ట్యాక్స్ డబ్బులతోనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కొన్నారని ఆరోపించారు. మోడీని ఢీకొట్టే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదన్నారు. రేవంత్ రెడ్డిని ఢీకొట్టాలి అన్నా తన వల్లే అవుతుందన్నారు. రెడ్ల పార్టీలలో ఉన్న బీసీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని కేఏ పాల్ అన్నారు.

కాంగ్రెస్ హయాంలో అప్పు పెరుగుతుంది
తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్టర్లు లేక ప్రతిదానిని అదానీకి కట్టబెడుతున్నారని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పు పెరుగుతుందని వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ తమ పార్టీకి ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. వరంగల్ లో మీట్ ది ప్రెస్ పెట్టకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనను అడ్డుకున్నారని కేఏ పాల్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, తమ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజల కష్టాలు తీరుస్తానని కేఏ పాల్ అన్నారు.












Click it and Unblock the Notifications