రాజయ్యా.. నువ్ సిద్ధమా? ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సవాల్!!
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇద్దరి మధ్య ప్రస్తుతం మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఉద్దేశించి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య షాకింగ్ ఆరోపణలు చేశారు.
కడియం శ్రీహరి అవినీతి తిమింగలం అని , కడియం శ్రీహరి అసలు ఎస్సీనే కాదని, కడియం శ్రీహరి అవినీతిపై ఖల్ నాయక్ అనే పుస్తకం రాసి ఉందని, త్వరలోనే ప్రజల ముందుకు తీసుకు వస్తానని తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.అభివృద్ధి విషయంలో తానే అప్పర్ హ్యాండ్ అన్నారు. అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా తాను రెడీ అని సవాల్ విసిరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘన్పూర్ తనదేన్నారు.

ఇక తాజాగా కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.ఎమ్మెల్యే రాజయ్య స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్న ఆయన ఎన్కౌంటర్ ల విషయంలో తనపై కావాలని బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక రాజయ్య తన కులం పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అసహనం వ్యక్తం చేసిన కడియం శ్రీహరి తన కులం గురించి మాట్లాడిన తాటికొండ రాజయ్య ముక్కు నేలకు రాసి తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజయ్య పై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు కడియం శ్రీహరి పేర్కొన్నారు.
అంతేకాదు దేశవిదేశాల్లో తనకు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలను నిరూపించాలని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. తన పేరుమీద ఉన్న ఆస్తుల వివరాలు తీసుకు వస్తే వాటన్నింటినీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని దళిత బిడ్డలకు రాసిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. సవాల్ కు రాజయ్య సిద్ధమా అంటూ ప్రశ్నించిన కడియం శ్రీహరి తన సవాల్ ను రాజయ్య స్వీకరించకపోతే ప్రజలకు రాజయ్య క్షమాపణలు చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications