ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదం: ఎంటరైన కడియం శ్రీహరి!!
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ జానకిపురం నవ్య వివాదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఈ వివాదంలో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన నవ్య తాను చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయని, అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు.
అంతేకాదు నేడు ఆధారాలతో మహిళా కమిషన్ ను కలవనున్నట్టు జానకిపురం సర్పంచ్ నవ్య ప్రకటించారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎంపిపి కవిత నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని నవ్య కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజయ్య జానకిపురం సర్పంచ్ నవ్య వివాదంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పందించారు.

ఇక ఈ వివాదం పై పోలీసులు విచారణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. విచారణ తర్వాత పార్టీపరంగా నిర్ణయాలు తీసుకుంటామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఆరోపణల్లో నిజానిజాలు తేలకుండా చర్యలు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇలాంటి పరిస్థితులలో ఈ వివాదం గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే రాజయ్య వర్గం ఇదంతా వచ్చే ఎన్నికలలో టికెట్ రాకుండా చేయడం కోసం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆడిస్తున్న డ్రామా అని ఆరోపిస్తున్నారు. నవ్య వెనకుండి కడియం శ్రీహరి ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జానకిపురం గ్రామ సర్పంచ్ నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజయ్య తో పాటు, ఎంపీ పి కవిత, తన భర్త రాజయ్య పిఎ మీద ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నవ్య లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జాతీయ మహిళా కమీషన్, రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఈ కేసుకు సంబంధించి విచారణ నివేదిక ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు నవ్య కు రెండు నోటీసులు జారీ చేశారు. ఆధారాలు ఇచ్చి తమకు సహకరించాలని కోరుతున్నారు. నవ్య మాత్రం తన వద్ద ఉన్న ఆధారాలను ఎఫ్ఐఆర్ చేశాకే ఇస్తానని చెప్తున్నారు. ఇప్పటికే రెండు ఆడియోలను నవ్య రిలీజ్ చేశారు.












Click it and Unblock the Notifications