పాపం.. కడియం శ్రీహరి; ఎమ్మెల్యే రాజయ్య ఆత్మీయ సమావేశాలకు, కార్యక్రమాలకు పిలవటం లేదట!!
స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వర్సెస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. వారిద్దరి మధ్య విబేధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో భాగంగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకొని ఈ వ్యవహారాన్ని అనేకమార్లు అధిష్టానం దాకా తీసుకువెళ్లారు. ఇక తాజాగా మరో మారు బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలలో కడియం శ్రీహరిని పిలవకపోవడంతో కడియం శ్రీహరి మీడియా ముఖంగా తన అసహనాన్ని వెళ్లగక్కారు.
ఎమ్మెల్యే రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అసహనం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని స్థానిక నాయకత్వంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు తనను పిలవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న కడియం శ్రీహరి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించడం లేదో చెప్పాలన్నారు.

తనను ఎందుకు ఆహ్వానించటం లేదు: కడియం శ్రీహరి ప్రశ్న
పార్టీ నిర్ణయానికి కట్టుబడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ రాజయ్య ను ఎమ్మెల్యేని చేయడానికి పని చేశానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం పనిచేశానని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన విజయం కోసం పనిచేస్తున్న నాయకుడు మీరేనంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి తనతో స్వయంగా చెప్పారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో, పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరుగుతున్న సమయంలో తన సహాయం కోరుతున్నారని, మిగతా సమయాల్లో పార్టీ కార్యక్రమాలకు కానీ సమావేశాలకు కానీ తనను ఆహ్వానించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మీయ సమావేశాలకు ఆహ్వానించకుంటే అభిప్రాయ బేధాలు
ఇప్పటికైనా పార్టీ కార్యక్రమాలకు ఆత్మీయ సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించాలని సూచించారు. లేకపోతే పార్టీలో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఎవరు చేసి ఏం చేసినా తాను సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. తాను కలిసి పని చేసే ఉద్దేశం ఉన్నా రాజయ్య కలుపుకుని పని చేసేలా కనిపించటం లేదన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. మరి రాజయ్య దీనికి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications