కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ అరెస్ట్.. ఏపీ, తెలంగాణలో వందల కోట్లు ఆస్తులు!
కాళేశ్వరం (Kaleswaram) కార్పొరేషన్ ఎండీ, మాజీ ఈఎన్సీ భూక్యా హరిరామ్‌ను అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదాయానికి మంచిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్‌లోని 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో హరిరామ్ తోపాటు బంధువులు పేరిట విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగి ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, మార్కుక్ మండలంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు తేలింది.

శ్రీనగర్ కాలనీలో ఇళ్లు, బొమ్మలరామారంలో మామిడితోట తోపాటు ఫాంహౌస్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. బీఎండబ్ల్యూ కారుతో సహా బంగారు ఆభరణాలు, పలు ఆస్తుల పత్రాలు, బ్యాంక్ డిపాజిట్లు గుర్తించారు. హరిరామ్ ఆస్తులు సుమారు రూ. 200 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, హరిరామ్ నివాసాల్లో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
మరోవైపు, కాళేశ్వరంలో మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి డిజైన్ మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అన్ని స్థాయిల్లోనూ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. మేడిగడ్డ ఆనకట్టలోని ఏడో బ్లాక్‌ను సురక్షితంగా తొలగించడం లేదా స్థిరీకరణ చేయాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. బ్యారేజీలు దెబ్బతినడంతో అన్నారం, సుందిళ్ల నుంచి కూడా నీటి మళ్లింపు సురక్షితం కాదని తేల్చి చెప్పింది. 3 ఆనకట్టలకు సంబంధించి అన్ని అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయాలని చెప్పింది. భవిష్యత్తులో ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించింది.












Click it and Unblock the Notifications