చేవెళ్ల చెల్లెమ్మ అంటూ ప్రారంభం, ఆంధ్రకు తరలింపు: వైఎస్‌పై కవిత
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏ కార్యక్రమమైనా చేవెళ్ల చెల్లమ్మ అంటూ ఇక్కడ ప్రారంభం చేసి, ఆంధ్రాకు తీసుకెళ్లే వారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మాజీ మంత్రి సబితారెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామంటూ పదేళ్లలో రంగారెడ్డి జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మూడు శాఖలు చేపట్టినా కనీసం ఫోన్ ఎత్తిన పాపానా పోలేదని, కేవలం జైపాల్ రెడ్డి సొంత గ్రామం విషయంలోనే ఫోన్ ఎత్తారని కవిత అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులను, ప్రభుత్వాన్ని సబితారెడ్డి విమర్శిస్తే ప్రతి ఒక్క నాయకుడు స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎదురులేని నాయకుడని, పార్టీ విజయపరంపర కొనసాగుతుందని అన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విమర్శలు చేస్తోందని, ఈ ప్రాజెక్టును రూ.4,160 కోట్లతో చేపట్టి పదేళ్లలో రూ.26కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. మొబలైజేషన అడ్వాన్స్ కింద రూ.176 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని, ఆ నిధులు ఎక్కడాకెళ్లాయో కాంగ్రెస్ నాయకులే చెప్పాలని అడిగారు.
పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా రంగారెడ్డి జిల్లాకు 5 లక్షలకు సాగునీరు అందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రాజకీయాలకతీతంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతున్నారని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ ప్లీనరీని పండుగలా జరుపుకోవాలని, జిల్లా నుంచి పెద్దఎత్తున తరలి రావాలన్నారు.

టీఆర్‌ఎస్‌కు 20 ఏళ్ల వరకు తిరుగులేదని, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో తిరుగులేని విజ యం సాధించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన పి.సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications