బంగారం లాక్కుని బావిలోకి తోసేశాడు.. 21 గంటలపాటు మృత్యువుతో పోరాడి..
ప్రస్తుతం యువత అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడి చదువుకుని ఏదోక ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నవారు తక్కువై పోతున్నారు. బెట్టింగ్, ఆన్ లైన్ జూదం, అప్పులకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చోరీలు, గ్యాంబ్లింగ్ లు, మోసాలు, నేరాలకు పాల్పడుతున్నవారు ఎక్కువైపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగిన ఈ షాకింగ్ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్దామంటేనే భయపడిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది..?
తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్ కు చెందిన గంగాధర లక్ష్మి (55) అనే పేద మహిళ రోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే జూలై 1 వ తేదీన కూడా కూలీ పని కోసం కరీంనగర్ అడ్డాకు వెళ్లింది. ఎవరైనా కూలీ ఇస్తారా..? అని ఎదురు చూస్తుండగా ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి కూలీ పని కోసం ఓ మహిళ కావాలని లక్ష్మిని తన బైక్ పైన ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అలా నుస్తులా పూర్ గ్రామ శివారులోకి రాగానే ఆ యువకుడు మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న అర తులం బంగారు గొలుసు, 20 గ్రాముల వెండి, కొంత డబ్బును బలవంతంగా లాక్కున్నాడు. అంతేకాక పోలీసులకు చెబుతుందనే భయంతో ఆమెను అక్కడే ఉన్న ఓ పాడుబడ్డ బావిలోకి తోసేసి అక్కడినుంచి పారిపోయాడు.
బావిలో పడిన లక్ష్మి ఎలాగోలా చిన్న తాడు సాయంతో ఒడ్డుకు వచ్చి అరుస్తూ ఉంది. ఎవరైనా సాయం చేయాలని విలపిస్తూ ఉంది. అలా దాదాపు 21 గంటల పాటు మహిళ బావిలో మృత్యువుతో పోరాడింది. తెల్లారి ఆ బావి యజమాని పొలం పని మీద రాగా.. బావి నుంచి కేకలు వినిపించాయి. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూడగా అందులో మహిళ కనిపించింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను గ్రామస్థుల సాయంతో ఎట్టకేలకు బయటకు తీశారు. ఆ తర్వాత ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడు దమ్మ దినేష్ రెడ్డి(21) గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన దినేష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆన్ లైన్ జూదానికి అలవాటు పడిన దినేష్ డబ్బు కోసం అడ్డదారి తొక్కాడు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న దినేష్ ఈజీ మని కోసం మహిళలను టార్గెట్ చేశాడు.
వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2026
ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై దొంగతనానికి పథకం వేసిన యువకుడు
కరీంనగర్లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఆన్లైన్ బెట్టింగులకు బానిసై దాదాపు రూ.4 లక్షలు నష్టపోయిన జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి… https://t.co/fbuNi0DXv3 pic.twitter.com/wNMbwKpJ2Q
అలా లక్ష్మి ని కరీంనగర్ కూలీ అడ్డా వద్ద పని ఉందని తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మి నుంచి లాక్కున్న బంగారాన్ని అప్పటికే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో తమదైన శైలిలో విచారణ జరిపి ఆ బంగారం తీసుకున్న స్వర్ణకారుడిని కూడా అరెస్ట్ చేశారు. వీరి వద్ద ఉన్న బంగారం, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.












Click it and Unblock the Notifications