టిడిపిది నిజం!: కర్నాటక అక్రమ ప్రాజెక్టులు, ఫిర్యాదు చేయాలన్న హరీష్

హైదరాబాద్: కర్నాటక అక్రమ ప్రాజెక్టులు నిజమేనని, వీటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకతీతంగా కలిసి రావాలన్నారు.

కర్నాటకలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని, అల్మట్టి ఎత్తు పెంచుతున్నారని, దీని పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలంగాణ టిడిపి నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాము చెబుతున్నామని ప్రతిష్టకు పోకుండా స్పందించాలన్నారు.

ఇదిలా ఉండగా, కృష్ణా నది పైన కర్నాటక రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తొన్న ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు టిఎంసీల సామర్థ్యం, 194 గేట్లతో రాయచూర్ జిల్లాలో నిర్మిస్తోన్న ప్రాజెక్టు వల్ల మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Karnataka irks Telangana State with barrage

కొద్దిపాటి నీరు సైతం కిందకు రాకుండా కర్ణాటక ప్రభుత్వం మోకాలడ్డుతున్న తీరు వాస్తవమేనని తేలింది. కృష్ణాపై మరో మినీ బ్యారేజీ నిర్మాణంతో వరద నీటిని ఒడిసిపట్టేందుకు కర్ణాటక సర్కారు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు వెల్లడైంది.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ రెండు రోజుల కిందట ఈ మేరకు సమగ్ర వివరాలతో నివేదికను సమర్పించింది. దీనిపై తాజాగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

తెలంగాణకు జరుగనున్న ఈ అన్యాయాన్ని నివారించేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్‌ఎస్ ఎంపీలకు మంత్రి సూచించారు.

కృష్ణా నదిపై కర్ణాటక ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కొత్తగా మినీ బ్యారేజీ నిర్మాణానికి ఉపక్రమించింది. పనులు కొనసాగిస్తున్నది. దీనిపై ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ఇందులో అక్రమ ప్రాజెక్టులు నిజమని తేలింది.

కర్ణాటక ప్రభుత్వం రాయచూర్ జిల్లా గిరిజాపూర్ గ్రామంవద్ద కృష్ణా నదిపై భీమా, కృష్ణానదుల సంగమానికి మూడు కిలోమీటర్ల ఎగువన ఒక బ్యారేజీ నిర్మాణాన్ని చేపడుతున్నదని కమిటీ నిర్థారించింది.
1,170 మీటర్ల పొడవున, 194 గేట్లతో నిర్మించే ఈ బ్యారేజీని 24 నెలల వ్యవధిలో నిర్మించేందుకు బెంగళూరుకు చెందిన రఘు ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ ఈ ఏడాది జూలై 28న కాంట్రాక్టు కుదుర్చుకున్నదని నివేదిక పేర్కొన్నది.

ఆ బ్యారేజీలో సుమారు రెండు టీఎంసీల నీరు నిలువ చేసే అవకాశం ఉన్నట్లు కమిటీ తెలిపింది. దీనివల్ల జూరాల ప్రాజెక్టుకు రావల్సిన లీన్ ఫ్లోస్ రాకుండా అడ్డుకోవడం జరుగుతుందని, దానికితోడు నారాయణ్‌పూర్ నుంచి రావాల్సిన పునరుత్పాదక నీళ్లు (రీజనరేటర్ వాటర్) కూడా తెలంగాణకు రాదని కమిటీ స్పష్టం చేసింది.

రాయచూర్‌లో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టుకు నీరు సరఫరా చేయడానికి కర్ణాటక పవర్ కార్పొరేషన్ ఈ బ్యారేజీ తలపెట్టిందని కమిటీ పేర్కొంది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దిగువ రాష్ర్టాలకు, ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి తెలియజేయాల్సిన అవసరాన్ని కర్ణాటక గుర్తించలేదని పేర్కొంది.

కేంద్ర జల సంఘానికి, కేంద్ర విద్యుత్ అథారిటీకి అయినా తెలిపిందా? కనీసం సూత్రప్రాయమైన అనుమతులు పొందిందా? అనే వివరాలు తెలియరాలేదని నివేదికలో పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో పొక్లెయిన్లు, టిప్పర్లు కనిపించాయని, వాహనాల రాకపోకలకు వీలుగా రాళ్లని తొలగించి, మట్టిని చదునుచేసేపని చురుకుగా సాగుతున్నదని కమిటీ తెలిపింది. అందుకు సాక్ష్యాధారాలుగా ఫొటోలు జతచేశారు.

ప్రస్తుత బ్యారేజీ పనుల నిలుపుదలకు ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజినీర్ ఖగేందర్ ప్రభుత్వాన్ని కోరారు. నివేదిక అందగానే మంత్రి హరీశ్ రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వెంటనే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజినీర్ నాగేందర్ రావుని ఆదేశించారు.

ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోవాల్సిందిగా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి మంత్రి ఫోన్‌లో సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+