చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్: ఇక తెలంగాణపై ఫోకస్
హైదరాబాద్: తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాసాని జ్ఞానేశ్వర్ పసుపు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కాసానికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. కాసాని 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఆయన ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు.

కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కాసానిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని తెలిపారు. టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాల్సి ఉందన్నారు. తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు.
ఇందుకోసం సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై పోరాటాలకు శ్రీకారం చుట్టాలన్నారు. మిగితా అన్ని అంశాలపై చర్చించుకుందామని టీ టీడీపీ నేతలతో ఆయన అన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. నాయకత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కావాల్సి ఉందన్న చంద్రబాబు.. అదే అంశంపై ఫోకస్ పెట్టామన్నారు.












Click it and Unblock the Notifications